Begin typing your search above and press return to search.

కొత్త టాలెంట్ ప్రదర్శించిన తలసాని

By:  Tupaki Desk   |   19 Sept 2021 3:02 PM IST
కొత్త టాలెంట్ ప్రదర్శించిన తలసాని
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రులంతా ఒక ఎత్తు అయితే.. తలసాని శ్రీనివాస్ యాదవ్ లెక్క కాస్త వేరుగా చెబుతారు. మిగిలిన మంత్రులకు లేని ప్రివిలైజ్ లు తలసాని సొంతమని చెబుతారు. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన తీరు ఎంతో సిత్రంగా సాగిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన అతి కొద్ది మంది తెలుగు తమ్ముళ్లలో ఆయన ఒకరు. షంషేర్ అన్నట్లుగా తిట్టేసిన ఆయన.. కారు పార్టీ మారిన తర్వాత ఎంత కమిట్ మెంట్ ను చూపిస్తున్నారో తెలిసిందే. పార్టీ మారిన క్షణంలోనే మంత్రి పదవిని చిక్కించుకోవటం ద్వారా.. తలసానికి కేసీఆర్ ఇచ్చే ప్రయారిటీ ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

అంతేనా.. ప్రగతిభవన్ కు మిగిలిన మంత్రులు వెళ్లాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. కానీ.. తలసానికి మాత్రం ప్రత్యేక మినహాయింపు ఉందని చెబుతారు. అంతేకాదు.. కేసీఆర్ తోనూ.. కేటీఆర్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న మంత్రుల సంఖ్య చాలా తక్కువని చెబుతారు. కానీ.. తండ్రి కొడుకులు ఇద్దరికి ఆమోదయోగ్యమైన మంత్రుల్లో తలసాని పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుందని చెబుతారు.

అంతేకాదు.. ఎంత క్లిష్టపరిస్థితుల్ని అయినా డీల్ చేసేందుకు వెనుకాడని ఆయన తత్త్వం ప్లస్ పాయింట్ గా చెబుతారు. ఎక్కడి దాకానో ఎందుకు? వినాయక నిమజ్జనం విషయంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల్ని ఈసారి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేందుకు తెలంగాణ హైకోర్టు నో అంటే నో చెప్పగా.. సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ ఏడాదికి అవకాశం ఇవ్వండి.. వచ్చే ఏడాదికి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పించుకోవటంలో తలసాని ఎంతో కీలకంగా వ్యవమరించారని చెప్పాలి. ఇలాంటివే కేసీఆర్ కు ఆయన్ను మరింత దగ్గరయ్యేలా చేస్తాయని చెబుతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనుకోనిరీతిలో వివాదాలు మీద పడినా.. వాటిని నేర్పుగా పరిష్కరించుకోవటంలో ఆయన మిగిలిన వారికి భిన్నంగా దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పాలి. అప్పుడప్పుడు తన మీదా.. తన కుమారుడి మీద వచ్చే వివాదాల్ని ఇట్టే సద్దుమణిగేలా చేయటంతో పాటు.. కాలంతో పాటు నేతలపై తన అభిప్రాయాల్ని మార్చుకునే సీఎం కేసీఆర్ కు.. తానెప్పుడూ అత్యవసరమైన వ్యక్తుల్లో ఒకడిగా మిగిలిపోవటం తలసానికి మాత్రమే సాధ్యమయ్యే విద్యగా అభివర్ణిస్తారు.

రాజకీయంగా ఇప్పటికే ఎన్నో టాలెంట్లు చూపించిన ఆయన.. ఈ రోజు జరుగుతున్న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన.. ఏకంగా బోటును నడిపిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రొఫెషనల్ నడిపినట్లుగా నడిపే క్రమంలో ఆయన ఎంత శ్రద్ధగా నడిపారన్న విషయం వీడియోలో కనిపిస్తుంది. బోట్ నడిపే క్రమంలో కొద్దిపాటి టెన్షన్ ఆయనలోకనిపించినా.. దాన్ని కవర్ చేస్తూ.. నడిపిన తీరును అభినందించాల్సిందే. మంత్రిగా ఉన్నతస్థానంలో ఉండి.. బోటింగ్ మీద పెద్దగా అవగాహన లేకున్నా.. నేర్పుగా నడిపిన వైనం చూస్తే.. తలసాని తనలోని మరో టాలెంట్ చూపించారని చెప్పక తప్పదు.