Begin typing your search above and press return to search.

టైం చూసుకొని అక్బరుద్దీన్ ను ఎక్కేసిన తలసాని

By:  Tupaki Desk   |   10 Sept 2020 3:40 PM IST
టైం చూసుకొని అక్బరుద్దీన్ ను ఎక్కేసిన తలసాని
X
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలన్ని ఒక ఎత్తు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ ఒక్కటే ఒక ఎత్తు. గ్రేటర్ పరిధిలో 23 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మజ్లిస్ వాటా తీసేస్తే.. దాదాపు అన్ని నియోజకవర్గాలు టీఆర్ఎస్ వే. అంతమంది నేతలున్నా.. సీఎం కేసీఆర్ ప్రాధాన్యత మాత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవే. ఉద్యమ నాటి నుంచి తనకు సన్నిహితుడైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కంటే కూడా తలసానికే ఎక్కువ చనువు ఉంటుందని చెబుతారు.

అంతదాకా ఎందుకు..? ప్రగతిభవన్ కు ఎప్పుడైనా వెళ్లేందుకు అనుమతి ఉన్న అతి కొద్ది మంది మంత్రుల్లో తలసాని ఒకరుగా చెబుతుంటారు. మిగిలిన వారిలో లేనిదేమిటి? తలసానిలో ఉన్నదేమిటి? అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతుంటుంది. దీనికి కారణం లేకపోలేదు. మాస్ నాయకుడిగా కనిపించే తలసాని.. కొన్ని విషయాల్లో చాలా క్లాస్ గా వ్యవహరిస్తుంటారు. దీనికి తోడు.. అధినేతకు విధేయుడిగా ఉండటం.. అత్యాశ తక్కువగా ఉండటంతో పాటు.. ప్రాక్టికల్ కు దగ్గరగా ఉండటం.. అవసరమైన సందర్భాల్లో నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేయటం లాంటివి కేసీఆర్ కు నచ్చుతాయని చెబుతుంటారు.

ఎక్కడిదాకానో ఎందుకు.. నిన్నటికి నిన్న అసెంబ్లీలో జరిగిన సన్నివేశాన్నే చూడండి. మిత్రపక్షంగా ఉంటూనే.. అప్పుడప్పుడు తామేమిటో చూపించే ప్రయత్నం చేస్తుంటారు మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రభుత్వం తీరును విమర్శించటం.. తప్పు పట్టటం చేసిన ఆయన మాటలకు సీఎం కేసీఆర్ రియాక్టు కావటం.. ఆ సందర్భంగా చిన్నపాటి వాగ్వాదం లాంటిది చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇదంతా అయ్యాక.. అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరు ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. చివరకు నగరానికి చెందిన వారు కూడా. అయితే.. అందుకు మినహాయింపుగా మంత్రి తలసానిని చెప్పాలి. కరోనాపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ అతి తెలివి ప్రదర్శించారన్న విమర్శతో పాటు.. సీనియర్ ఎమ్మెల్యే అయితే మాత్రం.. ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదని తేల్చటం గమనార్హం.

ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించొద్దన్న హెచ్చరికను చెప్పాల్సిన విధంగా చెప్పేసిన తీరు చూస్తే.. మిగిలిన నేతలకు తలసానికి మధ్యనున్న తేడా ఏమిటో అర్థమవుతుంది. అక్బరుద్దీన్ పై పంచ్ లు వేయటం ద్వారా.. పాత బాకీ కూడా తీర్చినట్లుగా చెప్పాలి. గతంలో అక్బరుద్దీన్ వర్సెస్ తన కొడుకు మధ్య జరిగిన వాగ్వాదంలో కామ్ గా ఉన్న తలసాని.. సమయం చూసి బదులు తీర్చినట్లుగా చెప్పాలి. స్వకార్యం.. స్వామికార్యం రెండు ఒకేసారి పూర్తి అయ్యేలా తలసాని తీరు ఉండటం చూస్తే.. ఆయన ఎంత చతురుడన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.