Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు తెలీకుండా వారిద్ద‌రి అండ‌ర్ స్టాండింగ్

By:  Tupaki Desk   |   26 Feb 2019 1:30 AM GMT
ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు తెలీకుండా వారిద్ద‌రి అండ‌ర్ స్టాండింగ్
X
కొన్ని ర‌హ‌స్యాలు ఎవ‌రికి వారుగా చెబితే కానీ బ‌య‌ట‌కు రావు. తాజాగా అలాంటి సీక్రెట్ ఒక‌టి రివీల్ అయ్యింది. అందుకు తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా మారింది. తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎంపికైన వేళ‌.. ఆయ‌న్ను అభినందిస్తూ స‌భ‌లోని ప‌లువురు స‌భ్యులు ప‌ద్మారావుతో త‌న‌కున్న అనుబంధం గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే.. ఎంత మంది మాట్లాడిన‌ప్ప‌టికీ మాజీ మంత్రి హ‌రీశ్ రావు.. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ లు చేసిన ప్ర‌సంగాలు హైలెట్ గా మారాయి.

హ‌రీశ్ ప్ర‌సంగం మొత్తం ప‌ద్మారావును పొగిడేయ‌గా.. త‌ల‌సాని మాత్రం త‌మ ఇద్ద‌రి మ‌ధ్య‌నున్న అనుబంధాన్ని చెప్ప‌ట‌మే కాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని ప‌లు అంశాల్ని త‌న స్పీచ్ లో వెల్ల‌డించి ఆస‌క్తిని పెంచాయి. త‌ల‌సాని మాట్లాడున్నంత‌సేపు స‌భ‌లోని స‌భ్యులు ప‌లువురు ఆయ‌న వైపే చూస్తూండిపోవ‌టం గ‌మ‌నార్హం.

త‌ల‌సాని త‌న ప్ర‌సంగంలో ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పారు. 2014 ఎన్నిక‌ల వేళ‌లో తాను.. ప‌ద్మారావు ఇద్ద‌రు వేర్వేరు పార్టీల్లో ఉన్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. ఆ ఎన్నిక‌ల్లో తాను.. ప‌ద్మారావు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేర్వేరు పార్టీల త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించామ‌న్నారు. అయితే.. ఇద్ద‌రి మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ తోనే తామిద్ద‌రం పోటీ చేసి గెలిచిన‌ట్లుగా ర‌హ‌స్యాన్ని రివీల్ చేశారు.

టీఆర్ఎస్ కు.. టీడీపీకి మ‌ధ్య‌నున్న రాజ‌కీయ శ‌త్రుత్వాన్ని అధిగ‌మించి.. ఈ ఇరువురు నేత‌లు త‌మ అధినేత‌ల‌కు తెలీకుండా ఒక అండ‌ర్ స్టాండింగ్ తో ప‌ని చేయ‌టం.. ఇద్ద‌రూ గెలిచారు. త‌ర్వాతి కాలంలో త‌ల‌సాని టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవ‌టం.. మంత్రి కావ‌టం జ‌రిగిపోయింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇరువురు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన‌ప్ప‌టికీ త‌ల‌సానికి మంత్రి ప‌ద‌వి ద‌క్కితే.. ప‌ద్మారావుకు తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ గా ఎంపిక‌య్యారు.