Begin typing your search above and press return to search.

సెల్ఫీ ల పై మోజా, జైలుకు పోతారు జాగ్రత్త!

By:  Tupaki Desk   |   19 Aug 2016 1:31 PM GMT
సెల్ఫీ ల పై మోజా, జైలుకు పోతారు జాగ్రత్త!
X
సెల్ఫీ రాయుళ్లకి ఇది చేదువార్త. ఎక్కడబడితే అక్కడ.. అంతకు మించి వేరే పని లేదన్నట్టుగా సెల్ఫీలు తీసుకుంటూ.. వాటిని ఎక్కడ పోస్టు చేసుకోవాలోనని తపన పడిపోతూ ఉండే కుర్రకారు జోరుకు మోడీ సర్కారు బ్రేకులు వేస్తోంది. దానికి కూడా కొన్ని హద్దులున్నాయ్.. హద్దుమీరితే జైలుకు పోతారు జాగర్త అంటూ హెచ్చరిస్తోంది. ఈ హద్దులు ప్రస్తుతానికి రైళ్లకు మాత్రమే పరిమితం. విషయం ఏంటంటే.. రైళ్లలో సెల్పీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్న వారు పెరుగుతుండడంతో కేంద్రం ఓ కొత్త చట్టం తెచ్చింది.

సెల్ఫీ ల మోజు ఎన్నో అనర్థాలకి కారణమవుతుంది. సెల్ఫీ ల మోజుతో కొంత మంది ప్రాణాలు సైతం పోవడం మనం చూస్తున్నాం. అయినా కొంతమందిలో మార్పు అనేది కానరావటం లేదు. ప్రతి పది నిమిషాలకి ఒక సెల్ఫి తీసుకోవడం దాన్ని ఫేస్ బుక్ లో లేదా వాట్సప్ లో పోస్ట్ చేయడం ఒక పిచ్చితనంగా చేస్తున్నారు. గతంలో ఫోటో స్టూడియో లోనో లేక మనింట్లో వున్న కెమరాతో ఫోటొలు తీసుకుని వాటిని ఆల్బమ్ లలో దాచి అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ ఆ నాటి జ్ఞాపకాలకి తలుచుకుంటుంటే ఆ ఆనందమే వేరు. అంతే కాని ప్రతి పది నిమిషాలకి మన మోము ఇతరులకు చూపిస్తుంటే వాళ్ళకి మనమంటే మోహం మొత్తడం ఖాయం. అలాగని టెక్నాలజిని వాడుకోవద్దని కాదు. కానీ ప్రతి దానికి ఒక పరిమితి వుంటుంది. అది దాటితేనే తంటా.

అతిగా సెల్ఫీలు దిగేవాళ్ళకి చర్మ సౌందర్యం పాడవుతుందని - ముసలితనపు ఛాయలు త్వరగా ఏర్పడతాయని డాక్టర్ల సూచన. అతివలూ మరి జాగ్రత్త.

ఇవన్నీ ప్రక్కన పెడితే రైల్వే శాఖ వారు పట్టాల పైన గాని. రైల్వే స్టేషను పరిసర ప్రాంతంలో గాని సెల్ఫీలు దిగితే నేరం కింద పరిగణించడానికి చట్టం తెస్తుందని వార్త. ఇక ముందు జాగ్రత్తా వుండండి. సెల్ఫీల మోజు తో జైలుకు వెళ్ళకండి.

అలాగే రైల్వే శాఖ వారు ఇంకో చట్టం కూడా తెస్తున్నారు. అది రైల్వే బోగిలలో పేకాట ఆడే వాళ్ళకోసం. కొంత మంది భోగిలలో పేకాట ఆడుతుంటారు. ముఖ్యంగా ఒక వూరిలో ఉద్యోగం చేస్తూ సాయంత్రానికి ఇంకో వూరిలో వున్న తమ ఇంటికి వెళ్ళే ఉద్యోగస్తులు. వాళ్ళు ఆడేది కాలక్షేపానికే అయినా ఇతర ప్రయాణికులకి ఎంత ఇబ్బందో గమనించరు. పేకాట రాయళ్ళందరూ ఒక చోట చేరి ఇతర ప్రయాణికులను అవతల సర్ధుకోమని చెప్పి ఇక వాళ్ళ గోల వారిదే. అలాగే దూర ప్రయాణాల్లో రాత్రిళ్ళు వాళ్ళ ఆట ముగిసేదాక లైట్లు వేసి గోల చేస్తూ ఇతర ప్రయాణికులను ఇబ్బంది గురి చేస్తుంటారు. ఇటు వంటి వారి కోసం రైల్వే శాఖ వారు కొత్త చట్టం తేబోతున్నారు. ఇక ముందు పేకాట రాయుళ్ళు జాగ్రత్త పడక తప్పదు.

చట్టాల వరకూ చూస్తే అంతా బాగానే ఉంది. అయితే - ప్రభుత్వం కేవలం చట్టం రూపొందించడంలో నే కాదు వాటిని అమలు చేయుడం లో కూడా ఖచ్చితంగా వుండాలి. మనకు చట్టాలు చాలా వున్నాయి కానీ అమలు చేయుడంలో అలసత్వం ఇంకా ఎక్కువగా వుంది. అందుకే చట్టాలంటే ప్రజల్లో భయం లేదు. ఈ రెండు చట్టాలు ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది, మేలు జరుగుతుంది. సెల్ఫీల జోరు కూడా కాస్త తగ్గుతుంది.