Begin typing your search above and press return to search.

ప్రవీణ్ కుమార్ సభ ఎఫెక్టు.. మహిళా తహసీల్దార్ పై వేటు

By:  Tupaki Desk   |   12 Aug 2021 10:30 AM IST
ప్రవీణ్ కుమార్ సభ ఎఫెక్టు.. మహిళా తహసీల్దార్ పై వేటు
X
చర్యల కత్తిని నూరుతోంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. ప్రభుత్వ విధానాలకు.. లైన్ కు భిన్నంగా నడిచిన వారెవరిని ఉపేక్షించకూడదన్నట్లుగా తాజా తీరు ఉండటం గమనార్హం. ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలోకి జాయిన్ కావటం తెలిసిందే. ఆదివారం ఆయన భారీ బహిరంగ సభను నిర్వహించటం తెలిసిందే. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు చేయటం తెలిసిందే. ఈ తీరు సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి తప్పుల్ని సూటిగా ఎత్తి చూపిన ప్రవీణ్ వైఖరి అధికారుల్లోహాట్ టాపిక్ గా మారింది. నెల క్రితం వరకు ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి విధేయుడిగా వ్యవహరించిన ప్రవీణ్ అంతలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత తీవ్రంగా విరుచుకుపడటాన్ని టీఆర్ఎస్ నేతలుసైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సహకారం అందించే వారిని ఉపేక్షించకూడదని.. చర్యలు తీవ్రంగా ఉండాలన్నట్లుగా వారి తీరు ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే నార్కట్ పల్లి తహసీల్దార్ పొడపంగి రాధపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు పడటం గమనార్హం. ఆమెను బదిలీ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వేరో సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించటమే కాదు.. ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా ఆమె చేయూత భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆమెపై వెంటనే చర్యలకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. దీనికి తోడు.. నిఘా వర్గాలు కూడా రాధపై నివేదికను ఇచ్చినట్లు చెబుతున్నారు.

తాజాగా నిర్వహించిన బహిరంగ సభకు కాస్త ముందుగా పలు సమావేశాల్లో రాధ చురుగ్గా పాల్గొందని.. అన్నింటికి మించి హైదరాబాద్ వెళుతూ నార్కెట్ పల్లి వద్ద ఒక హోటల్ లో 400 మందితో ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారని గుర్తించారు. ఈ సమావేశానికి రాధ కూడా హాజరైనట్లుగాచెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలకు తగ్గట్లే బదిలీ వేటు పడినట్లుగా చెబుతున్నారు. తాజా నిర్ణయం మిగిలిన అధికారులకు ఒక హెచ్చరికలా పని చేస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం యథావిధిగా తన ఆఫీసుకు వచ్చిన రాధ.. తనను బదిలీ చేశారన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే రిలీవ్ అయ్యారని చెబుతున్నారు.