Begin typing your search above and press return to search.

సెల్ఫ్ క్వారంటైన్‌ లో ఉన్న మర్కజ్ చీఫ్.. ఆడియో టేప్ విడుదల !

By:  Tupaki Desk   |   2 April 2020 6:30 AM GMT
సెల్ఫ్ క్వారంటైన్‌ లో ఉన్న మర్కజ్ చీఫ్.. ఆడియో టేప్ విడుదల !
X
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణమైనట్లుగా భావిస్తోన్న ఢిల్లీ మత ప్రార్థనలకు నేతృత్వం వహించిన మర్కజ్ మసీదు చీఫ్ మౌలనా సాద్ ఎక్కడున్నారు. ఏం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులను వేధిస్తోన్న ప్రశ్నలు ఇవి. ఢిల్లీ పోలీసులు ఆయన మీద ఎఫ్ ఐ ఆర్‌ ను నమోదు చేసిన వెంటనే అదృశ్యం అయ్యారు మౌలానా సాద్. అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో తప్పించుకున్నారు. ఆయన కోసం ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆడియో టేప్‌ ను ఆయన విడుదల చేశారు. తాను ఎక్కడున్నాడనే విషయాన్ని వెల్లడించనప్పటికీ.. ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌ లో ఉన్నానని చెప్పారు.

డాక్టర్ల సలహా మేరకు తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని, కరోనా వైరస్‌ నివారణకు సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో టేప్‌ ను విడుదల చేశారు. కిందటి నెల మూడు రోజుల పాటు నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సెల్ప్ క్వారంటైన్‌ లో ఉండాలని ఆయన సూచించారు. దీన్ని తన వేడుకోలుగా భావించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడానికి తాము నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలు ప్రధాన కారణం కాకూడని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

మత ప్రార్థనలకు హాజరైన వారు ఎక్కడ ఉన్నా గానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఈ ఆడియో టేప్ ద్వారా విజ్ఙప్తి చేసినట్లు తెలుస్తోంది. మౌలానా సాద్‌ పై ఎఫ్ ఐ ఆర్ నమోదైన వెంటనే ఆయన మాయం అయ్యారు. మౌలానా సాద్ కోసం ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. సాద్ సెల్‌ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన ఆచూకీని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మర్కజ్ మసీదులో ప్రార్థనలను నిర్వహించిన ఏడుమందిపై ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్‌ ను నమోదు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా మౌలానా జాడ తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఆడియో టేప్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.