Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్‌:ఆ ముగ్గురు ఆటగాళ్లపై దినేశ్‌ కార్తీక్ కామెంట్స్

By:  Tupaki Desk   |   21 Aug 2021 1:10 PM IST
టీ20 వరల్డ్ కప్‌:ఆ ముగ్గురు ఆటగాళ్లపై దినేశ్‌ కార్తీక్ కామెంట్స్
X
టీ20 ప్రపంచకప్‌ కోసం అన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే వివిధ జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచ్‌ హిట్టర్లందరు సమాయత్తమవుతున్నారు. ఈ టోర్నీలో ఏ జట్టు విజయం సాధిస్తుంది. ఏవి సెమీస్‌కి వెళుతాయనే చర్చ అప్పుడే మొదలైంది. మాజీ క్రికెటర్లందరు తమ అనుభవాన్ని రంగరించి జోస్యం చెబుతున్నారు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ రాబోయే టీ20 ప్రపంచ కప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అందులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రస్తావించాడు. పాండ్యాకు 2019 లో శస్త్రచికిత్స జరిగింది. అతడు జట్టులోకి తిరిగివచ్చినప్పటి నుంచి బ్యాటింగ్‌ లో నిరంతరం కష్టపడుతున్నాడని చెప్పాడు. పాండ్యా ఎప్పుడూ సవాలు విసిరే ఆటగాడని కొనియాడాడు. అతను టీ 20 ప్రపంచకప్‌ లో కీలక ఆటగాడిగా మారబోతున్నాడని అంచనా వేశాడు. కార్తీక్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌ లో ఉన్నాడు స్కై స్పోర్ట్స్‌ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. స్కై స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇషా గుహా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి ప్రస్తావించాడు.

టీ 20 ప్రపంచకప్‌ లో అద్భుతాలు చేయగల, మిగిలిన జట్లకు తలనొప్పిగా మారే ముగ్గురు ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ నికోలస్ పూరన్ పేరును కార్తీక్ చెప్పాడు. పూరన్ నాకు ప్రత్యేకమైన ఆటగాడు. అతను తన కెరీర్‌ను ముగించినప్పుడు టీ 20 ఫార్మాట్‌ లో గొప్ప ఆటగాడు అవుతాడు. ఎందుకంటే అతని బ్యాటింగ్ అద్భుతమైనది. ఎవరూ ఆడలేని బంతులను కూడా నికోలస్ సులభంగా ఆడగలడు. ఒకవేళ వెస్టిండీస్ టోర్నమెంట్ గెలవాలంటే ఇతడు చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారుతాడు అని తెలిపాడు.

ఇక అలాగే , ఆస్ట్రేలియా ప్లేయర్‌ మిచెల్ స్టార్క్ పేరును ప్రస్తావించాడు. స్టార్క్ వస్తే అది ఆస్ట్రేలియాకు గొప్పగా ఉంటుంది. డెత్ ఓవర్లలో అతను కీలకం. ఇటీవల కాలంలో అతని పనితీరు బాగోలేదు. కానీ వెస్టిండీస్‌తో ఆడిన చివరి సిరీస్‌లో ప్రత్యేకించి వన్డేల్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను తన వేగవంతమైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు ఏదైనా ఉంటే స్టార్క్ కీలకం కానున్నాడని చెప్పాడు.

భారత ఆటగాడు పాండ్య గురించి మాట్లాడుతూ .. పెద్ద టోర్నమెంట్లలో పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు కావాలి. ఇండియాలో అలాంటి ఆటగాళ్లలో పాండ్య ఒకరు. అతను బ్యాట్, బాల్ రెండింటిలోనూ సహకరిస్తాడు. ఎందుకంటే భారతదేశం తడబడినప్పుడు దాని రన్ రేట్‌ను వేగవంతం చేయాల్సి వచ్చినప్పుడు పాండ్యా బాధ్యత తీసుకుంటాడు. నేను అతని ఆటను చూసి ఆనందిస్తాను. అతను చాలా తెలివైనవాడు. అతను ఈ బృందానికి అధిపతి అవుతాడు అని కార్తీక్ చెప్పాడు. ఇకపోతే , ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌ ని టీమ్‌ ఇండియా ఒక్కసారి మాత్రమే ముద్దాడింది. 2007 ఆరంభ ఎడిషన్‌ లో ధోనీ సారథ్యంలో పాకిస్తాన్‌ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. వెస్టిండీస్‌ రెండుసార్లు(2012, 2016) విజేతగా నిలవగా.. 2010లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ గా అవతరించింది. న్యూజిలాండ్‌ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ ని సాధించలేదు. అయితే ఈసారి ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.