Begin typing your search above and press return to search.

పక్కా ప్లానింగ్: మూడో వేవ్ ముంచే వీల్లేని రీతిలో టీ20 ప్రపంచ కప్

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:30 AM GMT
పక్కా ప్లానింగ్: మూడో వేవ్ ముంచే వీల్లేని రీతిలో టీ20 ప్రపంచ కప్
X
సెకండ్ వేవ్ వేళ.. ఐపీఎల్ టోర్నీ అర్థాంతరంగా ఆపేయటం తెలిసిందే. పలువురు విదేశీ క్రికెటర్లు పెట్టా.. బేడా సర్దుకొని తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో టోర్నీ మీద ఆశలు పెట్టుకున్న అభిమానులు నీరు కారిపోతే.. వాణిజ్యపరంగా భారీ దెబ్బ పడిన సంగతి తెలిసిందే. దీంతో.. త్వరలో జరగాల్సిన టోర్నీల మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి వాటికి తెర దించుతూ తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇందుకు అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ముహుర్తంగా పెట్టారు.

మరి.. ఆ టైంలో థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఈ టోర్నీ పైనా ఎఫెక్టు పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అలాంటి వాటికి అవకాశం లేకుండా చేయటానికి ప్లాన్ లో మార్పులు చేసింది ఐసీసీ. ఈసారి టీ20 ప్రపంచ  కప్ టోర్నీ అతిథ్య దేశంగా భారత్ ఉంది. థర్డ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం భారత్ నుంచి వేదికను యూఏఈ..ఒమన్ కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టీ 20 ప్రపంచ కప్ ను దుబాయ్.. అబుదాబి.. షార్జా.. ఒమన్ వేదికలుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేదికలు మారాయే తప్పించి.. అతిథ్య దేశంగా మాత్రం భారతే ఉండనుంది. ఈ ప్రపంచ కప్ లో సూపర్ 12 దశకు ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు స్థానాల కోసం బంగ్లాదేశ్.. శ్రీలంక.. ఐర్లాండ్.. నెదర్లాండ్స్.. స్కాట్లాండ్.. నమీబియా.. ఒమన్.. పపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. అక్టోబరు 17న షురూ అయ్యే ఈ ప్రాథమిక గ్రూప్ పోటీల్లో టాప్ లో నిలిచిన నాలుగు జట్లను టోర్నీకి ఎంపిక చేయనున్నారు. చూస్తుంటే.. థర్డ్ వేవ్ కారణంగా టోర్నీ ఎఫెక్టు కాకూడదన్న పక్కా ప్లాన్ వేసినట్లుగా కనిపించక మానదు.