Begin typing your search above and press return to search.

T20 World Cup : సూపర్‌-12కు చేరిన జట్లు ఇవే !

By:  Tupaki Desk   |   23 Oct 2021 7:30 AM GMT
T20 World Cup : సూపర్‌-12కు చేరిన జట్లు ఇవే !
X
టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న క్రికెట్‌ పసికూన నమీబియా సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. సూపర్‌–12 దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ లో తన కంటే బలమైన ఐర్లాండ్‌ ను మట్టికరిపించి మెగా టోర్నీలో ముందడుగు వేసింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌ లో నమీబియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ ను ఓడించి తమ క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గ్రూప్-ఎ నుంచి సూపర్-12కి ఇప్పటికే శ్రీలంక అర్హత సాధించగా.. తాజాగా రెండో బెర్తుని నమీబియా దక్కించుకుంది. గ్రూప్- బి నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కి అర్హత సాధించాయి.

గ్రూప్-1లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో స్కాట్లాండ్, భారత్, నమీబియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ ఉన్నాయి. ఇందులోని నాలుగు జట్లు.. బంగ్లాదేశ్, శ్రీలంక, స్కాట్లాండ్, నమీబియా క్వాలిఫయింగ్ రౌండ్‌ లో మ్యాచ్‌ లు ఆడి సూపర్-12కి అర్హత సాధించాయి. గ్రూప్‌ లోని ప్రతి జట్టూ మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌ ని ఆడనుంది. భారత్ జట్టు ఆడే మ్యాచ్‌ లను ఓసారి పరిశీలిస్తే.. అక్టోబరు 24న పాకిస్థాన్‌ తో.. 31న న్యూజిలాండ్‌ తో, నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో, 5న స్కాట్లాండ్, 8న నమీబియాతో మ్యాచ్‌లను ఆడనుంది. నవంబరు 10న ఫస్ట్ సెమీ ఫైనల్, 11న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మాత్రం 14న జరగనుంది.

టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన మ్యాచ్‌లు ఈరోజు నుంచి ప్రారంభంకాబోతున్నాయి. గత ఆదివారం నుంచి క్వాలిఫయింగ్, వార్మప్ మ్యాచ్‌లతో చప్పగా సాగిన ఈ మెగా టోర్నీలో శనివారం నుంచి ఊపు రాబోతోంది. సూపర్-12లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అబుదాబి‌లో 3.30 గంటలకి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనుండగా.. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఢీకొనబోతున్నాయి. 2016లో చివరిగా టీ20 వరల్డ్‌కప్‌ జరగగా.. ఇంగ్లాండ్‌ పై ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వైట్ ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ ని గెలిపించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ఇప్పటికే రెండు సార్లు టీ20 వరల్డ్‌ కప్‌ గెలవగా.. ఇంగ్లాండ్ ఒకసారి విజేతగా నిలిచింది