Begin typing your search above and press return to search.

కరోనా నెగిటివ్​ ఉంటేనే పుష్కర స్నానం.. టీ సర్కారు మార్గదర్శకాలు

By:  Tupaki Desk   |   18 Nov 2020 10:35 PM IST
కరోనా నెగిటివ్​ ఉంటేనే పుష్కర స్నానం.. టీ సర్కారు మార్గదర్శకాలు
X
తెలంగాణ రాష్ట్రంలో 20 నుంచి తుంగభద్ర నదికి పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. తుంగభద్ర పుష్కరాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఈ సారి కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు, నిబంధనల నడుమ పుష్కరాలు జరగనున్నాయి. నవంబర్​ 20 నుంచి డిసెంబర్​ 1 వరకు పుష్కరాలు జరుగనున్నాయి.

పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీరోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పుష్కర స్నానాలకు అనుమతి ఇచ్చారు. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్లు పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావద్దు. దీంతోపాటు ప్రతి భక్తుడు కరోనా టెస్ట్​ చేయించుకొని నెగిటివర్​ రిపోర్ట్​ సర్టిఫికెట్​ తీసుకొని రావాలి. అయితే ఎవరైనా కరోనా రిపోర్ట్​ తీసుకురాకపోతే వారికి థర్మల్​ స్క్రీనింగ్​ చేసి అనంతరం అనుమతి ఇస్తారు. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే పుష్కరఘాట్​లోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు.

మరోవైపు పుష్కరఘాట్లను, ఆలయ ప్రవేశద్వారాలను ప్రతి పూట శానిటైజ్​ చేయనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు మాస్కులు ధ‌రించ‌డం, ఆరడుగుల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరోవైపు పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు విడుదల చేసింది. పుష్కరఘాట్ల వద్ద గజఈతగాళ్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులెవరు నది లోపలికి వెళ్లకుండా పోలీసులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.