Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షానికి మ‌నుషులు కావ‌లెను!!

By:  Tupaki Desk   |   30 Nov 2016 6:24 AM GMT
ప్ర‌తిప‌క్షానికి మ‌నుషులు కావ‌లెను!!
X
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్‌ పార్టీపై కార్య‌క‌ర్త‌లు - ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం త‌గ్గిపోతోంద‌నే వాద‌న‌లను ప‌క్క‌న పెడితే సాక్షాత్తు నాయ‌కుల‌కే పార్టీపై ఆస‌క్తి త‌గ్గిందా అనే సందేహం క‌లిగించేలా తాజా ప‌రిణామాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. నోట్ల రద్దుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవడానికి ఎంతో సానుకూల పరిణామమని ఆ పార్టీ ఢిల్లీ అదిష్టానం భావించింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ పీసీసీని ఆదేశించింది. అయితే నోట్ల రద్దుపై పార్టీ తలపెట్టిన ఆందోళనకు నాయకుల స్పందన అంతంత మాత్రమే వచ్చింది. ఈ గైర్హాజ‌రును చూస్తుంటే పార్టీపై అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పట్టు సడలుతుందనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల‌ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత...నోట్ల రద్దు - తదనంతర పరిణామాలపై చర్చించేందుకు పార్టీలోని కీలకనేతలతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఉత్తమ్‌ భావించి, అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు - ఉపాధ్యక్షులు - డీసీసీ అధ్యక్షులకు ఒక రోజు ముందుగానే సమాచారం అందించారు. సీనియర్‌ నాయకులతో వ్యక్తిగతంగా ఫోను చేసి ఆహ్వానించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు - 33 మంది ప్రధాన కార్యదర్శులు - 11 మంద ఉపాధ్యక్షులు - 10 మంది జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు మొత్తం 54 మందికి అధ్యక్షుడు సమాచారం అందజేశారు. అయితే సుమారు వంద‌మంది కార్య‌వ‌ర్గంలో స‌మావేశానికి హాజరైంది కేవలం ఆరుగురే! ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాకుండా చూస్తే ఐదుగురు మాత్ర‌మే వ‌చ్చారు! ఇద్దరు ఉపాధ్యక్షులు - ముగ్గురు ప్రధాన కార్యదర్శులతోపాటు ఉత్త‌మ్ తో పాటు హాజరయ్యారు.

కీల‌క‌మైన అంశంపై అత్యవసర సమావేశానికి రావాలంటూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినా నాయకులు లైట్‌ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒకవైపు జనం రోడ్డుమీదకు వచ్చి అష్ట కష్టాలు పడుతుండ‌టం, పార్టీకి ఉప‌యుక్త‌క‌ర‌మైన రీతిలో ఆందోళన ఉధృతం చేయాలని అధిష్టానం ఆదేశించ‌గా మరోవైపు అధ్యక్షుడు నిర్వహించిన అత్యవసర భేటీకి పార్టీ నేతల నుంచి స్పందన కరువైందని పార్టీలోనే చర్చ జరుగుతున్నది. పార్టీ అధ్యక్షుడు చెప్పినా కార్యవర్గ సభ్యులు హాజరు కాకపోవడంతో అధ్యక్షుడికి శృంగభంగమైందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సిన చోట గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యకర్తల సమావేశంలా మారిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం, ఇతర ఉహాగానాల నేపథ్యంలో పార్టీ నేతలు ఢిల్లీలోని అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది.ఈమేరకు మాజీ మంత్రులు - మాజీ ఎంపీలు తమ ప్రయత్నాల్లో తీరికలేకుండా ఉండటంతో, పెద్దనోట్ల రద్దు కార్యాచరణకు దూరంగా ఉన్నారనే ప్రచారం గాంధీభవన్‌ లో సాగుతున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/