Begin typing your search above and press return to search.

మునుగోడు రాజకీయ వాతావరణంపై టీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Aug 2022 4:22 AM GMT
మునుగోడు రాజకీయ వాతావరణంపై టీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
X
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఎదుగుదలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్. గడిచిన మూడున్నరేళ్లలో తెలంగాణలోని మరే రాజకీయ నేత ఎదగని కీలక స్థానాలకు ఎదిగిన వైనం ఆయనలోనే కనిపిస్తుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓడిపోవటం.. ఆ తర్వాత పార్టీ పదవులు లభించటం.. కీలకమైన బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకోవటం తెలిసిందే.

ఇటీవల బీజేపీ లో అత్యున్నత స్థానమైన పార్లమెంటరీ పార్టీలో (పార్లమెంటరీ బోర్డు) ఆయనకు చోటు లభించింది. పార్టీ పట్ల విధేయత.. నమ్మకంగా పని చేయటం.. అవినీతి ఆరోపణలు తక్కువగా ఉండటం లాంటివి ఆయనకు సానుకూల అంశాలుగా మారాయి. ఎమ్మెల్యేగా ఓడినప్పటికి.. ఆయనకు మంచి పదవులు ఇచ్చే విషయంలో బీజేపీ కేంద్ర పార్టీ సందేహించలేదు. ఇలాంటి వేళ.. ఆయన ఒక ప్రముఖ మీడియా సంస్థ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ అందరూ ఆసక్తిగా చూస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప పోరుపై ఆయన్ను అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అక్కడి వాతావరణం ఎలా ఉందన్న దానిపై తనదైన అంచనాల్ని ఆయన వెల్లడించారు. మునుగోడు తాను వెళ్లి వచ్చానని.. తాము ఊహించిన దాని కంటే ఎక్కువగా బీజేపీకి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వాతావరణం తమకు సానుకూలంగా ఉందన్నారు.

''4 వేల కార్లతో వెళ్లిన కేసీఆర్ ఆరు ఎకరాల్లో సభ పెడితే అది కాస్తా పేలవంగా సాగింది. మేం 25 ఎకరాల్లో సభ పెట్టాం. ఊహించిన దాని కంటే భారీగా జనం వచ్చారు. అక్కడ పోటీ బీజేపీ - టీఆర్ఎస్ మధ్యనే. కాంగ్రెస్ కు కచ్ఛితంగా మూడో స్తానమే ఉంటుంది. మునుగోడు ఉప పోరు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తోంది. అందుకే కేసీఆర్ కు నిద్ర పడ్టటం లేదు. అసహనంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు'' అని వ్యాఖ్యానించారు.

మునుగోడులో భారీగా ఖర్చు చేసేందుకు టీఆర్ఎస్ రెఢీ అయ్యింది కదా? అన్న ప్రశ్నకు లక్ష్మణ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. మునుగోడు ఉప పోరులో ఏ అంశాన్ని తాము వదలమని.. అక్కడ గెలవటం చారిత్రక అవసరమని.. ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడు డబ్బు భారీగా ఖర్చు పెట్టదని.. తమ పార్టీకి మోడీ.. అమిత్ షాల నాయకత్వమే పెద్ద అండ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయా? ముస్లింలు అధికంగా ఉన్న 19సీట్లలో బీజేపీ గెలిచే వీలు లేదు కదా? అని ప్రశ్నించినప్పుడు.. 31 ఎస్సీ.. ఎష్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. పార్టీ లోతుగా అధ్యయనం చేస్తుందని.. గెలుపు పక్కా అన్న ధీమాను వ్యక్తం చేశారు.