Begin typing your search above and press return to search.

స్విస్ బ్యాంకుల్లో న‌కిలీ నోట్లు...భార‌తీయులే టాప్‌

By:  Tupaki Desk   |   15 May 2017 5:49 PM GMT
స్విస్ బ్యాంకుల్లో న‌కిలీ నోట్లు...భార‌తీయులే టాప్‌
X
బ్లాక్ మ‌నీకి స్వర్గధామంగా పేరుగాంచిన స్విట్జర్లాండ్‌లో.. భారత కరెన్సీకి చెందిన నకిలీ నోట్లు పట్టుబడుతున్న సంఘటనలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాదిలో స్విస్ అధికారులు జప్తు చేసిన నకిలీ రూపీ నోట్ల విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దాంతో వారి దేశంలో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ నకిలీ విదేశీ కరెన్సీలో రూపాయి నోట్లది మూడో స్థానం. మొదటి రెండు స్థానాల్లో యూరో, డాలర్ ఉన్నాయి.

స్విట్జర్లాండ్ ప్రభుత్వ అధికారులు సీజ్ చేసిన నకిలీ రుపీ కరెన్సీలో అన్నీ రూ.500, రూ.1,000 నోట్లే. ఈ రెండు రకాల నోట్లను భారత ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లోనే నిషేధించింది. వాటి స్థానంలో కొత్త రూ.5,00, రూ.2,000 నోట్లను చెలామణిలోకి తెచ్చింది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్‌పోల్) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత సంవత్సరంలో 1,437 నకిలీ రూ.1,000 నోట్లు పట్టుబడ్డాయి. ఐదు నకిలీ రూ.500 నోట్లను కూడా జప్తు చేశారు. అదే 2015లో మొత్తం 342 నకిలీ రుపీ నోట్లు పట్టుబడ్డాయి. అందులో ఐదు రూ.500, ఒకటి రూ.100 ఇంకా 336 నోట్లు రూ.1,000 డినామినేషన్‌కు చెందినవి.

ఫెడ్‌పోల్ డాటా ప్రకారం.. 2012లో అత్యధికంగా 2,624 నకిలీ రుపీ నోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత సంవత్సరంలో (2013లో) ఈ సంఖ్య 403 నోట్లకు తగ్గింది. 2014లో 181గా నమోదైంది. ఇక 2011లో 1,144 నకిలీ రుపీ నోట్లు జప్తు కాగా.. 2010లో 212 నోట్లు పట్టుబడ్డాయి. అంతకు ముందు సంవత్సరాల్లో (2007, 2000 సంవత్సరాలు మినహాయించి) ఈ సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. 2007లో 25, 2000 సంవత్సరంలో 100 నకిలీ రుపీ నోట్లను స్విస్ అధికారులు జప్తు చేశారు.