Begin typing your search above and press return to search.

బెజవాడలో స్విగ్గీని బంద్ చేశారు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   7 Nov 2019 7:48 AM GMT
బెజవాడలో స్విగ్గీని బంద్ చేశారు.. ఎందుకంటే?
X
హోటల్ కు వెళ్లి నచ్చింది తినటం ఒకప్పటి మాట. నచ్చింది ఇంటికి తెచ్చుకోవటం కొంతకాలం క్రితం వరకూ ఉండేది. ఇప్పుడంతా ఆన్ లైన్ మాయాజాలమే. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చే సౌకర్యం వచ్చిన తర్వాత ఫుడ్ ఐటెమ్స్ ను ఇంటికి తెప్పించుకునే తీరులో చాలానే మార్పు వచ్చింది. కారణాలు ఏమైనా.. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి ఫుడ్ తెప్పించుకోవటంలో ఉన్న సౌలభ్యాన్ని అన్ని నగరాల్లోనూ సక్సెస్ అవుతోంది. ఇందుకు ఏపీ రాజధాని నగరానికి దగ్గర్లోని విజయవాడ అలియాస్ బెజవాడ మినహాయింపేమీ కాదు.

ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ చేసే ఫుడ్ యాప్స్ చాలానే ఉన్నా.. అందులో ప్రముఖ మైనది స్విగ్గీ. అయితే.. ఈ ప్రముఖ కంపెనీని విజయవాడలో హోటల్ యజమానులు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ నెల 11 నుంచి విజయవాడలో స్విగ్గీ అందుబాటులో ఉండదంటున్నారు. ఎందుకంటే.. విజయవాడ పరిధిలోని 240కు పైగా హోటళ్లు ఒకే మాట మీదకు వచ్చి స్విగ్గీని బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో.. రానున్న రోజుల్లో ప్రముఖఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ విజయవాడలో సేవలు అందించలేని పరిస్థితి ఉందంటున్నారు.

ఇంతకీ ఎందుకిలాంటి పరిస్థితి ఎదురైందన్న విషయానికి వస్తే.. విజయవాడలో బిజినెస్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో స్విగ్గీ జీరో కమిషన్ తో వ్యాపారం చేశారని.. తర్వాత ఐదు శాతం.. తర్వాత 10 శాతం కమిషన్ తీసుకుంటూ వ్యాపారాన్ని చేస్తున్నట్ు చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న డిమాండ్ తో ఇప్పుడది ఏకంగా 25 శాతం కమిషన్ వరకూ వెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రోజు డెలివరీ చేసిన ఆర్డర్ల మొత్తాన్ని ఆ రోజు కాకుండా వారం నుంచి రెండు వారాల మధ్య కాలంలో రెస్టారెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.

స్విగ్గీ తీరుతో హోటళ్ల మధ్య అనారోగ్య పోటీ పెరగటం. భారీ ఎత్తున కమిషన్లు ఇవ్వాల్సి రావటం.. హ్యాండ్లింగ్ ఛార్జిల పేరుతో వినియోగదారుల మీద అదనపు భారాన్ని మోపటం లాంటి వాటిలో బెజవాడలోని హోటల్ యజమానులంతా కలిసి సమావేశమయ్యారు. తమను ఇబ్బంది పెడుతున్న స్విగ్గీకి షాకివ్వాలని డిసైడ్ అయిన వారు.. సదరు పుడ్ డెలివరీ యాప్ మీద ఈ నెల 11 నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయించారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో విజయవాడ లో స్విగ్గీకి ఎదురైన ఈ సవాల్ ను ఎలా అధిగమిస్తుందో చూడాలి.