Begin typing your search above and press return to search.

మోడీ వచ్చాకే దేశంలోని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?

By:  Tupaki Desk   |   12 March 2021 2:00 PM IST
మోడీ వచ్చాకే దేశంలోని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?
X
షాకింగ్ నివేదిక ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. మోడీ సర్కారు పవర్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లుగా అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఒకటి వెల్లడించింది. స్వీడన్ కు సంబంధించిన ఈ సంస్థ వెల్లడించిన నివేదికలోని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం నుంచి ఎన్నికలు జరిగే నిరంకుశ రాజ్యం స్థాయికి భారత్ మారినట్లుగా పేర్కొంది.

స్వీడన్ కు చెందిన వీ-డెమ్ ఇన్ స్టిట్యూట్ సంస్థ తన తాజా నివేదికలో ఈ వివరాల్ని వెల్లడించింది. మీడియా గొంతు నొక్కటం.. ప్రభుత్వ విమర్శకులపై దేశద్రోహ చట్టాల్ని మితిమీరి ప్రయోగించటం తదితర కారణాల్ని చూపిస్తూ.. భారత్ స్థాయిని తగ్గించినట్లుగా సదరు సంస్థ వెల్లడించింది. ఇదే తరహా వ్యాఖ్యల్ని అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌజ్ కూడా తన తాజా నివేదికలో పేర్కొనటం గమనార్హం.

ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్కోర్ 2013లో 0.57గా ఉండగా.. 2020 చివరి నాటికి అది 0.34కి తగ్గినట్లుగా స్వీడన్ సంస్థ పేర్కొంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో 23 పాయింట్లకు తగ్గినట్లుగా స్పష్టం చేసింది. పొరుగున ఉన్న దాయాది దేశమైన పాక్ కు సరిసమానంగా భారత్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని పేర్కొంది. భారత్ తో పోలిస్తే.. బంగ్లాదేశ్.. నేపాల్ లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలు చూస్తే షాకింగ్ గా అనిపించకమానదు. మోడీ స్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సమాజంపై ఆంక్షలు పెరగ్గా.. హిందుత్వ సంస్థలకు స్వేచ్ఛ పెరిగినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ స్వీడన్ సంస్థ నివేదిక.. మోడీ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉందని చెప్పక తప్పదు.