Begin typing your search above and press return to search.

కేసీఆర్ - జగన్.. ఓ స్వామీజీ సెంటిమెంట్..

By:  Tupaki Desk   |   18 Jun 2019 4:56 AM GMT
కేసీఆర్ - జగన్.. ఓ స్వామీజీ సెంటిమెంట్..
X
దేశంలోని రెండురాష్ట్రాల సీఎంలు.. తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న అధినాయకులు వారు.. ఓ స్వామీజీ ముందర వినయ విధేయ రామాలుగా కూర్చున్నారు. ఆయన కాళ్లు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.. ఆయన వారసుడి పట్టాభిషేకాన్ని అంత సమయం వెచ్చించి మరీ పూర్తి చేశారు.

ఇంత గండరగండరలాంటి వాళ్లు అలా స్వామీజీ దగ్గర అంత సేపు ఒద్దికంగా ఉండడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ స్వామీజీ మాములోరు కాదు.. ఆయన విశాఖ శారదాపీఠం అధిపతి.. మహిమ గల గురూజీ అని పేరుంది.

దైవభక్తి ఎక్కువగల కేసీఆర్ కు శారదా పీఠం అధిపతి అయిన స్వామి స్వరూపానంద స్వామి బాగా కలిసి వచ్చారు. కేసీఆర్ నమ్మకానికి అనుగుణంగా గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు యజ్ఞాలు చేయించారు. అది కలిసివచ్చింది.. కేసీఆర్ సీఎం అయ్యారు. ఎన్నికలకు ముందర బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో స్నేహగీతం ఆలపించారు. ఆయన గెలుపునకు ఇతోదికంగా సాయం చేశారు. అలా స్వామి స్వరూపానంద మహత్య్మం చెప్పడంతో జగన్ కూడా విశాఖ వెళ్లి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. జగన్ కోసం కూడా స్వామిజీ యజ్ఞాలు - యాగాలు చేశారు.. మొత్తానికి స్వామీజీ దయో.. లేక ప్రజాబలమో తెలియదు కానీ ఇద్దరు సీఎంలు కేసీఆర్ - జగన్ లు సీఎం పీఠాన్ని అధిరోహించారు..

నాయకులు గెలిచారంటే అది అధికారపక్షంపై వ్యతిరేకత లేదా.. వారికంటే వీళ్లు బాగా చేస్తారని జనం ఆదరించడం వల్ల సాధ్యమవుతుంది. కేసీఆర్ - జగన్ లకు అది కలిసివచ్చింది. ఇక నమ్మకాలు ఉండనే ఉంటాయి. తిరుమల వెంకన్నను ప్రధాని నుంచి సామాన్యుల వరకూ అందరూ దర్శించుకుంటారు. ఆయన దేవదేవుడు.. అయితే ఆ దేవుడి ఆరాధనలో దేశంలో స్వామీజీలూ - పీఠాధిపతులు - గురూజీలు పుట్టుకొచ్చారు. ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారి ఆధిపత్యం పెరిగిపోయింది. యోగి ఆధిత్యనాథ్ లాంటి సన్యాసులను సీఎం చేసిన చరిత్ర బీజేపీది.

ఇలా ఆధ్యాత్మిక భావంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు తరించిపోతున్నారు. వారి నమ్మకాలు ఎలా ఉన్నా ఇప్పుడు తామే కేసీఆర్ - జగన్ లను సీఎంను చేశామన్న స్వామీజీల మాటలు విన్నాక మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు... ఈ విషయంలో జగన్ - కేసీఆర్ ల మౌనం చూశాక దేశంలో రాజకీయ నేతలు కూడా ఇక స్వామీజీల కోసం క్యూ కడుతారేమో..