Begin typing your search above and press return to search.

భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన భవిష్యవాణి

By:  Tupaki Desk   |   26 July 2016 1:17 PM IST
భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన భవిష్యవాణి
X
ఉజ్జయినీ మహంకాళి జాతర సందర్భంగా రంగం కార్యక్రమం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. స్వర్ణలత చెప్పే భవిష్యవాణి ఎలా ఉంటుందన్నది ప్రజలే కాదు.. రాజకీయ నేతల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గడిచిన రెండేళ్లలో పెదవి విరిచిన భవిష్యవాణి.. ఈసారి అందుకు భిన్నమైన తరహాలో ‘వాణి’ని వినిపించటం గమనార్హం.

రాష్ట్ర అభివృద్ధి మీద దిగులు పడాల్సిన పని లేదని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయని.. తాను భరోసాగా ఉంటానంటూ స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయన్న మాటను చెబుతూ.. రైతులతో పాటు అందరూ సంతోషంగా ఉంటారని.. ఎవరూ దిగుల పడాల్సిన అవసరం లేదన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరిత హారం.. మిషన్ కాకతీయ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయన్న మాటను చెప్పారు. అయుత చండీయాగం నిర్వహించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. గడిచిన రెండేళ్లలో మిశ్రమంగా ఉన్న భవిష్యవాణికి భిన్నంగా ఈసారి అంతా బాగుంది.. ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా ‘వాణి’ వచ్చింది. కేసీఆర్ సర్కారుకు ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది..?