Begin typing your search above and press return to search.

మళ్లీ తెరపైకి స్వర్ణప్యాలెస్ కేసు .... డాక్టర్ రమేష్ కి నోటీసులిచ్చిన పోలీసులు !

By:  Tupaki Desk   |   23 Sept 2020 1:20 PM IST
మళ్లీ తెరపైకి స్వర్ణప్యాలెస్ కేసు .... డాక్టర్ రమేష్ కి నోటీసులిచ్చిన పోలీసులు !
X
కరోనా జోరు చూపిస్తున్న సమయంలో .. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్ కరోనా కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం ఉదంతం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హోటల్ స్వర్ణప్యాలెస్‌ లో కరోనా కేర్ సెంటర్ ‌ను నెలకొల్పలిన డాక్టర్ రమేష్ పోతినేనికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్రిమినల్ ప్రొసీజర్ 160 కింద నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విచారణకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగనుంది. గత నెల 9వ తేదీన తెల్లవారు జామున విజయవాడ గవర్నరు పేటలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్‌ లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్ ‌లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 10 మంది మరణించారు. ప్రమాద సమయంలో 40 మంది పేషెంట్లు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ కరోనా వైరస్ కేర్ సెంటర్ ‌ను రమేష్ గ్రూప్ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ రమేష్ పోతినేని ఏర్పాటు చేశారు. అగ్నిమాపక నిబంధనలను పాటించలేదని, కరోనా నియమాలని పాటించకుండా కరోనా కేర్ సెంటర్ ‌ను నెలకొల్పారంటూ పోలీసులు ఆ ఘటన జరిగిన తర్వాత విచారణలో వెల్లడించారు. డాక్టర్ రమేష్ పోతినేనికి అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుకున్న వెంటనే ఆయన అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది.

ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ.హైకోర్టును ఆశ్రయించారు. దీనితో విచారణ కొనసాగించడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు.. స్టేను రద్దు చేసింది. విచారణ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో మరోసారి రమేష్ పోతినేనికి పోలీసులు తాజాగా నోటీసులను ఇచ్చారు. సీఆర్పీసీ సెక్షన్-160 కింద నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఆయన్ని ఆన్ లైన్ ద్వారా విచారణ చేసే అవకాశం.