Begin typing your search above and press return to search.

పుష్కారాల వేళ స్వామీజీల గోల

By:  Tupaki Desk   |   18 July 2016 11:20 AM GMT
పుష్కారాల వేళ స్వామీజీల గోల
X
ఏపీలో కృష్ణానది పుష్కారాల కొత్త మీమాంసకు తెర తీశాయి. ఏపీలో కృష్ణా నీరు స్వచ్ఛమైన కృష్ణానది నీరు కాదని.. అందులో పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి నీరు కలవడం వల్ల కృష్ణా పుష్కరాలు అనలేమన్న కొత్త వాదన వినిపిస్తోంది. దీంతో పవిత్రత దెబ్బతింటుందని కొందరు.. కాదు - కాదు - రెండు గొప్ప నదులు సంగమం వల్ల పవిత్రత మరింత పెరుగుతుందని ఇంకొందరు స్వామీజీ ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. దీంతో స్వామీజీలు తమకు ఇష్టమొచ్చిన వాదన చేస్తున్నారా లేదంటే శాస్ర్టం ప్రకారమే చెబుతున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. శాస్ర్తం ప్రకారమే చెబితే మరి రెండు రకాలుగా ఎందుకు చెబుతారు... అసలు వీళ్లకు శాస్ర్తం తెలుసా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పుష్కరాల విషయంలోనూ స్వామీజీలు - పీఠాధిపతులు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అందులో ఏది నిజమో తేల్చుకోలేక జనం తికమకపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణ పుష్కరాల వేళ గోదావరి నీటిని తెచ్చి కృష్ణా నదిలో కలుపుతోంది. దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణ నదిలోకి గోదావరి నీటిని తెచ్చి కలిపితే అవి కృష్ణపుష్కరాలు ఎలా అవుతాయని కొందరి వాదన. గోదావరి నీటిని తెచ్చి కలపడం వల్ల కృష్ణ పుష్కరాల పవిత్రత దెబ్బతింటుందని కాబట్టి అలా చేయడం సరికాదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు చెబుతున్నారు. కాబట్టి పుష్కరాల వేళ నదీ సంగమం సరికాదని స్వరూపానందేంద్ర వాదన.

అయితే మరో స్వామీజి… కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇంకోలా స్పందించారు. కృష్ణలో గోదావరి కలవడం మంచిదేనని సెలవిచ్చారు. మరో నది నీటిని కలపడంతో తప్పు లేదని చెప్పారు. గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తమతో కలిసే స్నానం చేశారని జయేంద్ర సరస్వతి గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద పుష్కరాల వేళ ఒక నది నీటిని మరో నదిలో కలపడంపై శాస్త్రం ఏం చెబుతోందో గానీ.. స్వాములు మాత్రం తమతమ రాజకీయ అభిప్రాయాలకు తగ్గట్లుగా చెబుతున్నారన్న వాదన వినిపిస్తోంది. విశాఖ స్వరూపానందేంద్ర చాలాకాలంగా ఏపీ ప్రభుత్వం - చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారు. అదేసమయంలో మిగతా స్వామీజీలు మాత్రం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్వరూపానంద - జయేంద్ర సరస్వతిలు శాస్ర్రానికి పరస్పర విరుద్ధ భాషణం చెబుతున్నట్లుగా ఉంది.