Begin typing your search above and press return to search.

స్వరూపానంద స్వామి బాగా చెప్పారు

By:  Tupaki Desk   |   14 July 2015 7:43 AM GMT
స్వరూపానంద స్వామి బాగా చెప్పారు
X
పుష్కరాల ప్రశస్త్యం, గోదావరి నదీస్నానం వల్ల కలిగే పుణ్యం గురించి చెబుతూ విశాఖ శారదాపీఠం అధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోకాల్డ్ స్వామీజీల వల్ల భక్తుల్లో అపోహలు పెరగుతున్నాయని... దానివల్ల అనుకోని పరిణామాలు, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్న భావంలో ఆయన వ్యాఖ్యనించారు. పలు ఛానళ్లలో పొద్దున్నే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారిలో కొందరు.. మరికొందరు తెలిసీతెలియని స్వామీజీలు చెప్పేవన్నీ నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారన్నారు. వారు రోజుకోరకంగా చెప్పి తమ పబ్బం గడుపుకొంటున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో తొలిరోజు స్నానం చేస్తే అధిక పుణ్యం వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేయడంతో రాజమండ్రి కిక్కరిసిపోయిందన్నారు. తొలిరోజే పుష్కరస్నానం చేస్తే పుణ్యం వస్తుందనేది అపోహే అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు... ఈవిషయంలో ఆయన స్పష్టత ఇచ్చారు కూడా. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యం వస్తుందని... ఇంకా చెప్పాలంటే 12 రోజులే కాదు ఏడాదిలో ఎప్పుడు స్నానం చేసినా అదే పుణ్యం వస్తుందని స్వామి స్వరూపానంద సరస్వతి వివరించారు. దీంతో పాటుగా గోదావరి జన్మస్థలం నాసిక్ నుంచి సముద్రంలో కలిసే చోటయిన అంతర్వేది వరకు ఎక్కడైనా ఆ నదిలో స్నానం చేయొచ్చని... రాజమండ్రి కోటిలింగాల రేవుకే రావాలని ఏమీ లేదని చెప్పారు. కాబట్టి భక్తులు తమకు వీలయిన రోజుల్లో వీలైన ప్రాంతంలో గోదావరి నదీస్నానం చేస్తే తొక్కిసలాటలు, ప్రమాదాలు లేకుండా పుష్కరాలు సజావుగా సాగుతాయని చెప్పారు.