Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్ కాదు..క‌మ‌ల్ హుస్సేన్‌

By:  Tupaki Desk   |   8 Nov 2017 1:48 PM GMT
క‌మ‌ల్ హాస‌న్ కాదు..క‌మ‌ల్ హుస్సేన్‌
X
హిందూ అతివాదులు తమ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉగ్రవాదాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని కమల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇంకా ర‌చ్చ కొన‌సాగుతునే ఉంది. తాజాగా దీనిపై స్పందించిన స్వామి ప‌రిపూర్ణ‌నంద విల‌క్ష‌ణ న‌టుడి తీరుపై విరుచుకుప‌డ్డారు. ప్రేక్ష‌కాద‌ర‌ణ లేకే క‌మ‌ల్ రాజ‌కీయాలంటున్నారని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. క‌మ‌ల్ హాస‌న్ ను జీరో నుంచి హీరో చేసింది హిందూ ప్రేక్ష‌కులేన‌ని ప‌రిపూర్ణానంద గుర్తు చేశారు. ఆయ‌న క‌మ‌ల్ హాస‌న్ కాదు క‌మ‌ల్ హుస్సేన్ అని ఆరోపించారు.

రాష్ట్రీయ హిందూ సేనను స్థాపించిన స్వామి పరిపూర్ణానంద తమ సేన తరఫున మొదటిసారి మీడియా ముందుకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. హైదరాబాద్ జలవిహార్ లో మాట్లాడుతూ...తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి 10 వేల మంది యువతతో రాష్ట్రీయ హిందూ సేన సమగ్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. మొదట తెలంగాణ మీద దృష్టి పెట్టామని అన్నారు. తెలంగాణ యువత హిందూ ధర్మాన్ని కాపాడే వేదిక కోసం ఎదురుచూస్తోందని అన్నారు. హిందూ తీవ్రవాదం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ పై స్వామి పరిపూర్ణానంద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కమల్ హాసన్ కాదని కమల్ హుస్సేన్ అయిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయనకు హిందూ దర్మం ఏ ద్రోహం చేసిందని, అతివాదం ఎక్కడ కనిపించిందని స్వామీజీ ప్రశ్నించారు. ముస్లింలు, క్రిస్టియన్లలో అతివాదం లేదా? హిందువుల్లోనే ఉందా? అని నిలదీశారు. కమల్ కు ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ముందా? అని సూటిగా ప్రశ్నించారు. కమల్ హాసన్ వెనుక ఎవరున్నారన్న విషయాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపనున్నట్లు తెలిపారు.

తాను కమల్‌ హాసన్ లాంటి వారిని మరోసారి హెచ్చరిస్తున్నానని స్వామి ప‌రిపూర్ణానంద‌ అన్నారు. హిందుత్వం, హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే హిందువులతో సఖ్యతతో ఉండాలని, ఒకవేళ ఇతరులకు అమ్ముడు పోతే వారితోనే బతకండని అన్నారు. తాము భగవద్గీతను చదువుకున్నామని, సహనంగా ఎలా ఉండాలో తెలుసని, అలాగే సహనం కోల్పోతే ఏం చేయాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. దేశం గురించి, ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ఆర్‌హెచ్ఎస్ ఎస్ ద్వారా బుద్ధి చెబుతామని స్వామీజీ హెచ్చరించారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే ఊరుకోబోమని అన్నారు. కమల్ హాసన్ మాత్రమే కాదని - కమల్ ను ప్రేరేపిస్తోన్న వారందరూ దేశ ద్రోహులేనని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. హిందుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేవారు ఎవ్వరైనా దేశ ద్రోహులేనని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ధర్మం కోసం నిలబడాలని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.