Begin typing your search above and press return to search.

హోం డెలివరీ; జగన్ ఎమ్మెల్యే కారు దొరికిందోచ్

By:  Tupaki Desk   |   7 March 2016 6:43 AM GMT
హోం డెలివరీ; జగన్ ఎమ్మెల్యే కారు దొరికిందోచ్
X
రెండు రోజుల క్రితం పెను సంచలనంగా మారిన కర్నూలు ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డికి చెందిన కారు దొరికింది. శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కారును.. ఇంటి దగ్గరే దొంగలించిన దొంగలు.. ఎట్టకేలకు ఆయన కారును ఆయన ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లటం గమనార్హం. ఇటీవల ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త కారు కొన్నారు. కారు కొన్న రెండు రోజులకే ఆయన కారు చోరీకి గురి అయ్యింది. ఎమ్మెల్యే ఇంటి ఎదుటే దొంగతనం జరగటం.. ఎమ్మెల్యే ఇల్లు.. జిల్లా ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

కారును దొంగలించిన దొంగలు.. కారుతో పాటు.. ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని కూడా చోరీ చేశారు. ఈ దొంగతనాన్ని సవాలుగా తీసుకున్న కర్నూలు పోలీసులు కిందామీదా పడినా ఆచూకీ లభించలేదు. ఊహించని విధంగా సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటి వద్ద పోయిన కారు మళ్లీ కనిపించటం గమనార్హం. దొంగతనం చేసిన దొంగలు.. తాము దొంగలించింది.. ఎమ్మెల్యే కారు అన్న విషయాన్ని గుర్తించి.. లేనిపోని తలనొప్పి ఎందుకన్న ఉద్దేశంతో కారును విడిచి పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా దొంగతనానికి గురైన కారును ఎమ్మెల్యే ఇంటి దగ్గరకే తీసుకొచ్చి వదిలేసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.