Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కు జైకొట్టిన ద‌ర్శ‌క‌-నిర్మాత జంట‌!

By:  Tupaki Desk   |   26 Sep 2018 6:23 AM GMT
జ‌గ‌న్ కు జైకొట్టిన ద‌ర్శ‌క‌-నిర్మాత జంట‌!
X
ఏపీలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు జ‌నం నీరాజనాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా చాలామంది జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న విష‌యం విదిత‌మే. విల‌క్ష‌ణ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి - క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ లు కొద్ది రోజుల క్రితం పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్దతు తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని, జ‌గ‌నే కాబోయే సీఎం అని థ‌ర్టీ ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ ప‌లుమార్లు ఘంటాప‌థంగా చెప్పారు. టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంక‌ట్...కూడా కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్ ను పాద‌యాత్ర‌లో క‌లిసి త‌న సంఘీభావం తెలిపారు. తాజాగా, మ‌రో ఇద్దరు టాలీవుడ్ ప్ర‌ముఖులు జ‌న‌నేత జ‌గ‌న్ కు జై కొట్టారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి - నిర్మాత అచ్చిరెడ్డిలు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారిద్ద‌రూ వైసీపీకి సంఘీభావం తెలిపారు.

టాలీవుడ్ లో పేరు పొందిన ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల జంటల్లో ఎస్వీ కృష్ణా రెడ్డి-అచ్చిరెడ్డిల జంట ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో హిట్ చిత్రాల‌ను టాలీవుడ్ కు అందించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ - అలీల‌తో ప‌లు హాస్య ప్ర‌ధాన చిత్రాల‌ను తెర‌కెక్కించి ఘ‌న‌విజయాల‌ను అందుకున్నారు. తాజాగా వీరిద్ద‌రూ జ‌గ‌న్ కు తమ సంఘీభావం తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 271వ రోజున విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న జ‌గ‌న్ ను వారిద్ద‌రూ క‌లిసి త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. జ‌గ‌న్ తో వారిద్ద‌రూ కొద్దిసేపు ముచ్చటించారు. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌ని, జ‌గ‌న్ సీఎం అవుతారని వారిద్ద‌రూ ఆకాంక్షించారు. 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న కొద్దీ జ‌గ‌న్ కు టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ కు ప్ర‌త్య‌క్షంగా సంఘీభావం తెలుప‌గా....మ‌రికొంద‌రు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత‌మంది సినీ ప్ర‌ముఖులు....జ‌గ‌న్ కు బాస‌ట‌గా నిలిచే అవ‌కాశ‌ముంద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు, విజయనగరం జిల్లా - ఎస్‌ కోట నియోజకవర్గం - కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం ద‌గ్గ‌ర సోమవారంనాడు జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్క‌డ జగన్ పైలాన్ ను ఆవిష్కరించి పక్కనే రావి మొక్కను నాటారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభ‌మైన‌ ప్రజాసంకల్ప యాత్ర నిర్విరామంగా 11 జిల్లాల మీదుగా కొన‌సాగుతూ విజయనగరం జిల్లాలో కొనసాగుతోన్న సంగ‌తి తెలిసిందే.