Begin typing your search above and press return to search.

డ్రైవర్ హత్య కేసు: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు?

By:  Tupaki Desk   |   23 May 2022 12:47 PM GMT
డ్రైవర్ హత్య కేసు: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు?
X
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చిక్కుల్లో పడ్డాడు. ఆయన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానస్పద మృతి కేసులో విచారణలో సంచలన నిజాలు వెలుగుచూసినట్టుగా ప్రచారం సాగుతోంది. కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబునే హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాకినాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏలూరు డీఐజీ పాలరాజు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ప్రత్యేకంగా విచారిస్తున్నట్టు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత అనంతబాబును అరెస్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ చేసేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోంది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.. అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో దీనిపై పోలీసులు, ప్రభుత్వం అలెర్ట్ అయ్యారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు ఈ కేసును ఛేదించినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఉదయ్ భాస్కర్ పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నట్టుగా మీడియాలో ప్రచారం సాగుతోంది.తానే హత్య చేశానని.. ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశానని వైసీపీ ఎమ్మెల్సీ పోలీసుల విచారణలో అంగీకరించినట్టుగా ఆఫ్ ది రికార్డుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతానని బ్లాక్ మెయిల్ చేశాడని.. కొట్టి బెదిరిద్దామనుకున్నానని.. కానీ ఆ క్రమంలో ఇలా జరిగిందని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక తాజా అప్డేట్ ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించారని.. ఆయన్ను అరెస్ట్ చేయడం లాంఛనమేనని తెలుస్తోంది. ఈ రాత్రికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్ చూపే అవకాశముందని సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ సమాచారాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజుకు తెలియజేయనున్నట్టు తెలిసింది. ఈ సాయంత్రమే మండలి చైర్మన్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు.

ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. అరెస్ట్ తర్వాతే సస్పెన్షన్ ఉంటుందని ఆయన అన్నట్టు తెలిసింది.