Begin typing your search above and press return to search.

ఆత్మకూరు టీడీపీలో సస్పెన్స్

By:  Tupaki Desk   |   29 May 2022 3:30 PM GMT
ఆత్మకూరు టీడీపీలో సస్పెన్స్
X
తెలుగుదేశం పార్టీ మహానాడు సాక్షిగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటంటే మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి మనవడు రితీష్ రెడ్డి తన భార్య కైవల్యారెడ్డితో కలిసి నారా లోకేష్ ను కలిశారు. ఇంకేముంది కైవల్య రెడ్డి టీడీపీలో చేరిపోతున్నారని, ఇది వైసీపీకి పెద్ద షాక్ అంటూ టీడీపీ అనుకూల మీడియా బ్రేకింగుల మీద బ్రేకింగులు ఇచ్చింది. ఇక్కడే సదరు మీడియా ఎందుకింత ఉత్సాహం చూపిందో అర్ధం కావటంలేదు.

టీడీపీలోనే ఉన్న కైవల్యారెడ్డి మళ్ళీ టీడీపీలో చేరటం ఏమిటి ? ఇందులో వైసీపీకి షాక్ కొట్టేదేముంది ? బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. కాబట్టి బిజివేముల కుటుంబానికి పోటీ చేసే అవకాశం లేదు. అందుకనే రితేష్ రెడ్డి పార్టీ నేతగా కంటిన్యు అవుతున్నారంతే.

కాకపోతే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో కైవల్య ఉత్సాహం చూపిస్తున్నారట. ఎందుకంటే ఈమె వెంకటగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆనం రామనారాయరెడ్డి కూతురు.

ఆనం గతంలో ఆత్మకూరు ఎంఎల్ఏగా కూడా గెలిచారు. కాబట్టి అక్కడ ఆనంకు మద్దతుదారులున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీపై ఆమె ఉత్సాహం చూపితే చూపించచ్చు. ఇంత మాత్రాన వైసీపీకి షాక్ కొట్టేదేముంది ? వైసీపీ ఎంఎల్ఏ గౌతమ్ రెడ్డి మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో గౌతమ్ తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇక్కడనుండి టీడీపీ పోటీచేస్తుందో లేదో కూడా తెలీదు. నారా లోకేష్ ను కైవల్య కలవగానే మీడియాలో గోల మొదలైపోయింది.

అసలామె లోకేష్ ను ఎందుకు కలిసిందో కూడా తెలీదు. లోకేష్ ఆమెతో ఏమి మాట్లాడారో కూడా ఎవరికీ తెలీదు. అయినా సరే ఆత్మకూరు టికెట్ అడిగిందని రచ్చ మొదలైపోయింది. ఎప్పుడైతే మీడియాలో గోల మొదలైందో వెంటనే ఆత్మకూరు టీడీపీలో సస్పెన్స్ పెరిగిపోతోంది.

ఇక్కడ టీడీపీ పోటీచేస్తుందా చేయదా అన్నదే అర్ధం కావటంలేదు. ఒకవేళ పోటీచేయాలని అనుకుంటే నియోజకవర్గంలోనే ఉన్న నేతలకు అవకాశం ఇస్తారు కానీ బద్వేలు నుండి అభ్యర్ధిని దిగుమతి చేసుకుంటారా ? దీంతోనే టీడీపీలో సస్పెన్స్ పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.