Begin typing your search above and press return to search.

‘గాలి’ సేవలు తెరవెనుకనే : కన్నడ కమలం వ్యూహం!

By:  Tupaki Desk   |   14 Feb 2018 8:01 AM GMT
‘గాలి’ సేవలు తెరవెనుకనే : కన్నడ కమలం వ్యూహం!
X
కేవలం కన్నడ రాజకీయాలు మాత్రమే కాదు.. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న గనుల సంపదతో.. పొరుగు రాష్ట్రాలు - దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన గాలి జనార్దన రెడ్డి వెలుగులు మసకబారిపోతున్నాయి. సొంత పార్టీ భాజపా కూడా.. ఆయన సొంత నియోజకవర్గం బళ్లారిలో కూడా .. ఆయన ముద్ర లేకుండా ఎన్నికల బరిలోకి వెళ్లాలని అనుకుంటోంది. గాలి జనార్దన రెడ్డి సంపదల పరంగా.. ఆయన సేవలు పార్టీ కి అవసరమే గానీ.. పార్టీ ఆశీస్సులు - అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కుని ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఆయనకు కూడా అవసరమే గానీ.. బహిరంగంగా ఆయన ప్రమేయం - ప్రభావం పార్టీమీద ఉన్నట్లు కనిపించకుండా బళ్లారి ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది భాజపా యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న గాలి జనార్దనరెడ్డికి గానీ - ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డికి గానీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వకుండా దూరం పెట్టాలనేది పార్టీ వ్యూహంగా ఉందిట. భాజపాలో గాలి బ్రదర్స్ వైభవం వెలగబెట్టినప్పుడు వారి అనుచరులుగా ఉన్నవారు... ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు కూడా. ఇలాంటి నేపథ్యంలో బళ్లారి లోని బీకే శ్రీనివాసమూర్తి కుమారుడు బీకే సుందర్ ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి - తద్వారా క్లీన్ ఇమేజి ఉన్న వ్యక్తిని తెరమీదికి తెచ్చి.. పార్టీ స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం.

బీకే శ్రీనివాసమూర్తి కుమారుడు డాక్టర్ బీకే సుందర్ కు టికెట్ దక్కేలా కేంద్రంలోని సుష్మాస్వరాజ్ చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆమె బళ్లారి నుంచి ఎంపీగా కూడా పోటీచేశారు. అప్పటినుంచి బీకే శ్రీనివాసమూర్తి కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ఇంటి ఆడపడుచుకుగా క్లెయిం చేసుకున్న సుష్మాస్వరాజ్ అప్పటినుంచి ప్రతి ఏటా వారింట్లో జరిగే వరలక్ష్మీ వ్రతానికి రావడమూ అలవాటు చేసుకున్నారు. ఆ లెక్కన తనకు సోదరుడి లాంటి బీకే సుందర్ ను ఇక్కడ ఎమ్మెల్యే చేయడానికి ఆమె ప్రయత్నించడంలో తప్పు లేదని పలువురు భావిస్తున్నారు. పైగా గాలి జనార్దనరెడ్డి అవినీతి ఇమేజికి దూరంగా.. కొత్త రక్తాన్ని తెరపైకి తెస్తే తప్ప మనుగడ కష్టం అని భాజపా కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో బీకే సుందర్ కు లైన్ క్లియర్ అని.. గాలి బ్రదర్స్ తెరవెనుక నుంచి తమ సహకారం అందించాల్సిందేనని అంతా అనుకుంటున్నారు. బళ్లారిలోని గాలి వ్యతిరేకులంతా ఇప్పటికే బీకే సుందర్ కు మద్దతు ఇస్తూ.. పార్టీ విజయానికి రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరి భాజపా.. స్వచ్ఛ వ్యూహం ఎలా ఫలితమిస్తుందో చూడాలి.