Begin typing your search above and press return to search.

దంప‌తుల హ‌నీమూన్‌లో సుష్మా మార్క్ ట్విస్ట్‌!

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:43 PM GMT
దంప‌తుల హ‌నీమూన్‌లో సుష్మా మార్క్ ట్విస్ట్‌!
X
సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండ‌ట‌మే కాదు స‌మ‌స్య‌ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ మ‌రో రికార్డు సృష్టించారు. కొద్దికాలం క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట భార‌తీయ వ‌రుడు - విదేశీ వ‌ధువు వీసా స‌మ‌స్య‌ను పరిష్కరించిన సుష్మా ఇపుడు భార‌తీయ జంట‌కు హ‌నీమూన్ ఆనందాన్ని పంచారు.

ఢిల్లీకి చెందిన ఫైజ‌న్ ప‌టేల్ అనే ఓ వ్య‌క్తికి ఈ మ‌ధ్యే పెళ్ల‌యింది. ఇద్ద‌రూ క‌లిసి హ‌నీమూన్‌కు యూర‌ప్ వెళ్లేందుకు డిసైడ‌య్యారు. కానీ చివ‌రి నిమిషంలో భార్య పాస్‌పోర్ట్ ఎక్క‌డో పోవ‌డంతో ఫైజ‌న్ ఒక్క‌డే యూర‌ప్ విమానం ఎక్కాడు. అయితే త‌న భార్యను గుర్తు చేసుకుంటూ విమానంలో త‌న భార్య ఫొటోను ప‌క్క‌న‌పెట్టుకొని దిగిన సెల్ఫీని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు ఫైజ‌న్‌. అందులో సుష్మా స్వ‌రాజ్‌ను కూడా ట్యాగ్ చేశాడు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆ ట్వీట్‌ను చూసిన వెంట‌నే సుష్మా స్పందించారు. ''మీ భార్య‌ను వెంట‌నే న‌న్న క‌ల‌వ‌మ‌ని చెప్పండి.. ఆమె మీతోపాటే హ‌నీమూన్‌కు వ‌చ్చేలా చేస్తాను'' అని సుష్మా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన ఫైజ‌న్‌కు నోట మాట రాలేదు. తాను చెప్పిన‌ట్లే 12 గంట‌ల వ్య‌వ‌ధిలో ఆమెకు ఓ డూప్లికేట్ పాస్‌పోర్ట్ ఇప్పించారు సుష్మా. ఈ విష‌యాన్ని మ‌రోసారి ఫైజ‌న్‌కు ట్వీట్ చేయ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆ భార్యభ‌ర్త‌ల అనుబంధానికి సుష్మా ఇచ్చిన ప్రాధామ్యంతో ఇపుడు ఆమెను ప‌లువురు మెచ్చుకుంటున్నారు.