Begin typing your search above and press return to search.

సుష్మాతో ఇవాంకా భేటీ..ఇండియాపై ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   19 Sep 2017 6:06 AM GMT
సుష్మాతో ఇవాంకా భేటీ..ఇండియాపై ఫోక‌స్‌
X
ఐక్య‌రాజ్య‌సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున పాల్గొనేందుకు న్యూయార్క్ చేరుకున్న విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ త‌న ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డిపారు. అమెరికా - జపాన్ విదేశాంగ మంత్రులు రెక్స్ టిల్లర్ సన్ - తారోకొనోతో చర్చలు జరిపారు. అయితే ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌తో అనేక దౌత్య‌ప‌ర‌మైన అంశాల‌పై చ‌ర్చించిన సుష్మాస్వ‌రాజ్ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య - ఆయ‌న ముఖ్య స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్‌ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశానికి సంబంధించిన కీల‌క అంశాలు ప్ర‌స్తావన‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌ లో అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్‌)-2017కు అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్ సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆహ్వానం మేర‌కు ఇవాంక ఇక్క‌డ‌కు విచ్చేసేందుకు అంగీక‌రించారు. ఈ స‌మావేశానికి సంబంధించిన అంశాల‌తో పాటు మ‌హిళా పారిశ్రామిక‌వేత్తల‌కు ప్రోత్సాహం - అమెరికా-భార‌త్ శ్రామిక అభివృద్ధిపై చర్చి జరిగిందని స‌మాచారం. ఇండియా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన‌ ప‌లు అంశాల‌పై కూడా సుష్మాస్వ‌రాజ్‌ తో ఇవాంక ట్రంప్‌ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు అమెరికా - జపాన్ విదేశాంగ మంత్రులతో డోక్లాం వివాదం - చైనా వ్యవహారశైలి గురించి విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ప్రధానంగా చర్చించిన‌ట్లు సమాచారం. సముద్ర జలాల రక్షణ - పరస్పర సహకారం - మూడు దేశాల మధ్య నౌకా గమన స్వేచ్ఛ అంశాలపై చర్చలు సాగాయి. వారంరోజుల అమెరికా పర్యటనలో ఉన్న సుష్మాస్వరాజ్ వివిధ దేశాలతో 20వరకు ద్వైపాక్షిక - త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఈ నెల 23న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఆమె ప్రసంగిస్తారు.