Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు షాకింగ్ గా మారిన స‌ర్వేలు

By:  Tupaki Desk   |   1 May 2018 12:10 PM GMT
త‌మ్ముళ్ల‌కు షాకింగ్ గా మారిన స‌ర్వేలు
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు తొమ్మిది నెల‌ల‌కు పైనే స‌మ‌యం ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఒక‌లాంటి ఎల‌క్ష‌న్ మూడ్ వ‌చ్చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఓప‌క్క క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం.. కాస్తంత వ్య‌వ‌ధిలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్ రాష్ట్రాల ఎన్నిక‌లు.. అవి ముగిసిన కొద్ది నెల‌ల‌కే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేస్తుండ‌టంతో వ‌రుస ఎన్నిక‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

జాతీయ‌స్థాయిలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొని ఉంది. తెలంగాణ‌తో పోలిస్తే.. ఏపీలో ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కూ ముదురుతోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఓప‌క్క ఏపీ విప‌క్ష నేత ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో చేస్తున్న పాద‌యాత్ర నేటికి 150 రోజులకు చేరుకుంది. ఇంకా క‌వ‌ర్ చేయాల్సిన జిల్లాలు చాలానే ఉన్నాయి. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న ఆయ‌న‌.. ఉభ‌య‌గోదావ‌రి.. విశాఖ‌.. విజ‌య‌న‌గ‌రం.. శ్రీ‌కాకుళం జిల్లాల్లో ప‌ర్య‌టించాల్సి ఉంది.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంత‌కంత‌కూ పెరుగుతున్న క్రేజ్ నేప‌థ్యంలో.. దానికి బ్రేకులు వేసేందుకు బాబు ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. ఏపీకి హోదా ఇవ్వ‌ని పాపాన్ని మోడీ ఖాతాలో వేసి.. ఆయ‌న మీద పోరును షురూ చేశారు. గ‌డిచిన నాలుగేళ్లుగా కామ్ గా ఉన్న ఆయ‌న.. గ‌డిచిన నెల రోజులుగా అదే ప‌నిగా మోడీని విమ‌ర్శిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇది మ‌రింత ఉధృతం కానుంద‌ని చెబుతున్నారు.

హోదా సెంటిమెంట్ తో పాటు.. మోడీని త‌ప్పు ప‌డుతూ.. ఆయ‌న కార‌ణంగానే ఏపీలో ఎలాంటి అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌లేద‌న్న ముద్ర వేసి.. రాజ‌కీయంగా భారీ ల‌బ్థి పొందాల‌ని బాబు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గ‌డిచిన నెల వ్య‌వ‌ధిలో భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల్ని అదే ప‌నిగా నిర్వ‌హిస్తుండ‌టం చూస్తున్న‌దే. త‌న కార్య‌క్ర‌మాల జోరుతో ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న పాద‌యాత్ర మీడియాలో ఫోక‌స్ కాని రీతిలో ఆయ‌న వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు.

బాబు కుయుక్తులు పెద్ద‌గా ప‌ని చేయ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ ను ఎంత‌గా అణ‌గ‌దొక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారో.. ప్ర‌జ‌ల్లో అంత‌గా ఆయ‌న‌పై క్రేజ్ పెరుగుతోంద‌ని.. దీనికి నిద‌ర్శ‌నంగా పాద‌యాత్ర‌కు పెరుగుతున్న ప్ర‌జా స్పంద‌న‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేస్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు.. ప్ర‌భుత్వం ఎన్ని రంగాల్లో విఫ‌ల‌మైంద‌న్న విష‌యంపై ఆయ‌న చేస్తున్న ఘాటు విమ‌ర్శ‌లు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా విన‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్న వైనం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ మ‌ధ్య‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఏపీ స‌ర్కారు అవినీతిపైనా.. బాబు కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ అవినీతి మీదా ఆయ‌న ప్ర‌శ్న‌లు వేయ‌టం తెలిసిందే. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఏపీలో భారీ అవినీతి చోటు చేసుకుంద‌ని.. ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ సొంత లాభం మీద‌నే త‌ప్పించి.. ప‌నుల మీద ఫోక‌స్ చేయ‌లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

ఈ వాద‌న‌లో వాస్త‌వం ఉంద‌న్న విష‌యాన్ని కొంద‌రు టీడీపీ నేత‌లు లోగుట్టుగా ఒప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. అంత‌కంత‌కూ ప‌డిపోతున్న బాబు గ్రాఫ్ తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పుడుతున్న వేళ‌.. జిల్లాల వారీగా పెద్ద ఎత్తున స‌ర్వేలు త‌ర‌చూ చేస్తున్న టీడీపీ నేత‌లు..ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త వారిని వ‌ణికిస్తోంది. ఇటీవ‌ల అనంత‌పురం జిల్లాలో టీడీపీకి కొంచెం దగ్గర సంస్థ స‌ర్వే చేయించిన‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అనంత‌లో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ ప‌డ‌నుంద‌ని చెబుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ 12 స్థానాల్లో విజ‌యంసాధిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మూడు సీట్ల‌కు మించి గెల‌వ‌ద‌న్న లెక్క‌లు తేలిన‌ట్లుగా చెబుతున్నారు. స‌ర్వేల సారాంశం చూస్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌కు నోట మాట రాని ప‌రిస్థితి. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో టీడీపీ గ్రాఫ్ ఎంత దారుణంగా ప‌డిపోయింద‌న‌టానికి అనంత‌పురం జిల్లా ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. ఇదే రీతిలో టీడీపీ బ‌లంగా ఉన్న చాలా జిల్లాల్లో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను క‌ట్ట‌డి చేసేందుకు సిట్టింగ్‌ ల‌కు బాబు చేయి ఇవ్వొచ్చ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఓడిపోయే సిట్టింగుల‌తో కొంప మునుగుతుంద‌న్న విష‌యంపై క్లారిటీ వ‌స్తే.. వారిని మోసేందుకే బాబు ఎంత‌మాత్రం ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతున్నారు. దాదాపు 70 శాతం సిట్టింగుల‌కు షాక్ త‌గిలే వీలుంద‌ని చెబుతున్నారు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఈ అంకెలో కాస్త అటు ఇటు ఉంటుంద‌ని.. మొత్తంగా చూస్తే సిట్టింగుల‌కు భారీగా చెల్లుచీటి ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. లేనిప‌క్షంలో భారీ షాక్ బాబుకు త‌ప్ప‌దంటున్నారు. ఒక‌వేళ‌.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు త‌మ్ముళ్ల‌కు టికెట్లు ఇచ్చే విష‌యంలో బాబు హ్యాండ్ ఇవ్వ‌కుంటే పుట్టి మునిగే ప్ర‌మాదం ఉంద‌ని బాబు భావించి టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రిస్తే.. తిరుగుబాటు అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగితే ప‌రిస్థితి ఏమిట‌న్న ప్ర‌శ్నకు త‌మ్ముళ్లు స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్న ప‌రిస్థితి. చూస్తుంటే త‌మ్ముళ్ల టైం బాగోన‌ట్లుగా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.