Begin typing your search above and press return to search.

పట్టువదలని జగన్..ఇంగ్లీష్ మీడియం పై తాడోపేడో

By:  Tupaki Desk   |   22 April 2020 9:00 AM IST
పట్టువదలని జగన్..ఇంగ్లీష్ మీడియం పై తాడోపేడో
X
ఆంధ్రప్రదేశ్ లోని భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యాబోధన చేయాలనేది సీఎం వైఎస్ జగన్ సంకల్పం.. పేదలకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో బోధించాలన్న ఆయన తపనకు ప్రతిపక్షాలు, కార్పొరేట్ శక్తులు అడ్డుపడ్డాయి. హైకోర్టుకెక్కాయి. హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. జగన్ సర్కారు ఇంగ్లీష్ మీడియం బోధన జీవోలను కొట్టివేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో బోధన చేయాలనే విషయాన్ని తల్లిదండ్రుల మీదే వదిలేయాలని.. వారు ఎంచుకున్న భాషలో విద్యాబోధన కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సీఎం జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా కొత్త ప్లాన్ వేశారు. హైకోర్టు సూచించిన దిశలోనే ఏపీలోని పేదలకు ఆంగ్ల మాధ్యమం అందేలా జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం విశేషంగా మారింది.

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను , పాఠశాల పేరెంట్స్ కమిటీలను ఏ మీడియంలో బోధించాలనే దానిపై సర్వే చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఇంటింటి సర్వేను వెంటనే చేయాలని నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతను గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లా, మండలస్థాయి విద్యాశాఖాధికారులు దీన్ని పర్యవేక్షిస్తారు. ఈ మేరకు పాఠశాల ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ సర్వే కోసం ఒక ఫార్మాట్ ను రూపొందించారు.

ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన చేయాలని జగన్ సర్కారు అధికారులను ఆదేశించింది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే ఇది పూర్తి చేయాలని.. అప్పుడు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇక దీని అమలు కోసం వచ్చేనెల మొదటి వారంలో సుప్రీం కోర్టులో ఓ స్పెషల్ లీవ్ పిటీషన్ ను వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రుల అభిప్రాయాల సర్వేను సమర్పించాలని యోచిస్తోంది.

ఇలా పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను ప్రారంభించాలనకున్న జగన్ కలలను ప్రతిపక్షాలు హైకోర్టుకెళ్లి అడ్డుకున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే ఇంగ్లీష్ మీడియం బోధనకు జగన్ సర్వే చేస్తున్నారు. మెజార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియంకే మొగ్గు చూపుతారు. దీంతో ప్రతిపక్షాల కుట్రలకు చెక్ పడనుంది. జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే కల నెరవేరనుంది. పేదలకు ఆంగ్ల విద్య అందించడం కోసం జగన్ ప్రభుత్వం పడుతున్న తపనపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.