Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని ఏదో తేల్చి చెప్పిన సర్వే ఆఫ్ ఇండియా

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:05 PM IST
ఏపీ రాజధాని ఏదో తేల్చి చెప్పిన సర్వే ఆఫ్ ఇండియా
X
అమరావతి నుంచి రాజధాని తొలగింపు, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు....రాజధాని అంశంపై సుప్రీం కోర్టు తలుపు కూడా తట్టారు. ఇక, సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లు అమోదంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. దీంతో, టెక్నికల్ గా ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతేనని కొందరు....ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందాయి కాబట్టి ఏపీకి మూడు రాజధానులు అని మరికొందరు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి ఒక రాజధానా...లేక మూడు రాజధానులా అన్న అంశంపై సర్వే ఆఫ్ ఇండియా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో అమరావతిే ఏపీ రాజధాని అని సర్వే ఆఫ్ ఇండియా తాజాగా మ్యాప్ విడుదల చేసింది. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఏపీ రాజధానిగా అమరావతి ఉందని, అమరావతి రాజధాని అని మ్యాప్ లో చేర్చామని సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. 2019 నవంబర్ 21న లోక్‍సభలో టీడీపీ ఎంపీగా గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు తాజాగా ఆగస్టు 18న సర్వే ఆఫ్ ఇండియా సమాధానం పంపింది. 9వ ఇంగ్లిషు ఎడిషన్ 2019లోనూ, 6వ హిందీ ఎడిషన్ 2020లోనూ అమరవాతిని ఏపీ రాజధానిగా పొందుపరిచామని తెలిపింది.


గత ఏడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా చేర్చలేదు. ఇండియా మ్యాప్‌లో అమరావతిని చూపించకపోవడం వివాదాస్పదమైంది. ఇలా చేయడం ఏపీ ప్రజలను, అమరావతికి శంకు స్థాపన చేసిన ప్రధాని మోడీని అవమానించడమేనని ఎంపీ హోదాలో నాడు జయదేవ్ పార్లమెంటులో ప్రస్తావించారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని అన్నారు. ఆ మరుసటి రోజే.. కేంద్రం విడుదల చేసి అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా, పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ ప్రకారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్ లేఖ రాశారు. ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ లేఖను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ లేఖపైఎంపీ గల్లా జయదేవ్ హర్షం వ్యక్తం చేశారు. 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆ విషయం లేవనెత్తానని, ఆ అంశాన్ని పరిశీలించి తాజాగా సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన చేసిందని ట్వీట్ చేశారు.