Begin typing your search above and press return to search.

ఇచ్చ‌ట అమ్మ‌త‌నం అమ్ముకోబ‌డును!

By:  Tupaki Desk   |   18 Jun 2017 1:38 PM IST
ఇచ్చ‌ట అమ్మ‌త‌నం అమ్ముకోబ‌డును!
X
పేదరికం, అసహాయతలు ఆసరాగా సాగుతున్న వ్యాపారం ఇది.. నిరుపేద మహిళలకు డబ్బు ఎరవేసి, హైదరాబాద్ నగరం నడిబొడ్డున అక్రమంగా సాగిస్తున్న సరోగసి (అద్దెగర్భం) దందా బయటపడింది. అద్దెగర్భం దాల్చే మహిళలను నిబంధనలకు విరుద్ధంగా దవాఖాన యాజమాన్యం నిర్బంధిస్తున్నట్టు వెల్లడయింది. వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండానే ఇప్పటివరకు గర్భంకోసం 500 మంది మహిళలను వినియోగించినట్టు తేలింది. హైదరాబాద్ - ఢిల్లీ - నేపాల్ - నాగాలాండ్ - డార్జిలింగ్ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు విచారణలో బయటపడింది. ఆ పిల్లలను విదేశాలకు తరలిస్తున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో డాక్టర్ సుమిత్‌ శేఖర్ సాయికిరణ్ హాస్పిటల్ పేరుతో సరోగసి వ్యవహారం కొనసాగిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సాయికిరణ్ హాస్పిటల్ - ఇన్‌ పెర్టిలిటీ కేంద్రంపై రెండురోజుల కిందట నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. సంబంధిత శాఖ నుంచి దవాఖానకు అనుమతి ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టరు పద్మజకు సమాచారం అందించారు. సాయికిరణ్ దవాఖానలోని సరోగసి కేంద్రానికి సంబంధించి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఎలాంటి రికార్డులు లేవు. డీఎంహెచ్‌వో పద్మజ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి శనివారం సాయికిరణ్ హాస్పిటల్‌ పై దాడులు జరిపారు. తనిఖీల్లో సాయికిరణ్ దవాఖానకు వైద్య - ఆరోగ్యశాఖ నుంచి సరోగసి (అద్దెగర్భం) నిర్వహించేందుకు ఏఆర్టీ (ఆర్టిఫిషియల్ రీప్రొడక్షన్ థెరపి) అనుమతి లేదని తేలిందని పద్మజ, సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. నాలుగైదేండ్లుగా ప్రైవేటు దవాఖానలో సాగుతున్న ఈ వ్యవహారంపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఉప్పల్, బాలానగర్ ప్రాంతానికి చెందిన 16మంది, ఢిల్లీ, నేపాల్, నాగాలాండ్, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు చెందినవారు 32మంది మహిళలు సాయికిరణ్ దవాఖానలో అద్దెగర్భం దాల్చినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 2 నెలల నుంచి 8నెలలు నిండిన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు కనుగొన్నారు. సరోగసి నిబంధనల ప్రకారం స్వీయ అంగీకారంతో అద్దెగర్భం దాల్చే మహిళలను నిర్బంధించకూడదు. కాని సాయికిరణ్ దవాఖానలో మాత్రం మహిళలను కన్సీవ్ కాకముందు నుంచి గర్భం దాల్చి, ప్రసవించేవరకు వారిని దవాఖానలోనే నిర్బంధిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారిణి పద్మజ తెలిపారు. అద్దెగర్భం ద్వారా జన్మించిన శిశువులను విదేశాలకు తరలించకూడదని ఆమె వివరించారు. సాయికిరణ్ దవాఖానలో సరోగసి ద్వారా జన్మిస్తున్న పిల్లలను విదేశాలకు విక్రయిస్తున్నారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు చెప్పారు.

మ‌రోవైపు గ‌ర్భం దాల్చే మహిళలకు ప్రాంతలవారీగా అద్దె చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నగరానికి చెందిన మహిళలకు రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు, ఢిల్లీ, నేపాల్, నాగాలాండ్ వంటి దూర ప్రాంతాల మహిళలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు దవాఖాన యాజమాన్యం అద్దె చెల్లిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్‌ లో మరో ఏజెంటు నిరుపేద మహిళలకు డబ్బు ఎరచూపి అద్దె గర్భానికి ప్రోత్సహిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ ఇన్‌ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వైద్యాధికారులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేస్తామని ఆయన వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/