Begin typing your search above and press return to search.

ఆశ్చర్యానికి గురి చేసిన సీఎం జగన్.. ఇంతలో అంత మార్పు ఏల?

By:  Tupaki Desk   |   20 July 2021 5:07 AM GMT
ఆశ్చర్యానికి గురి చేసిన సీఎం జగన్.. ఇంతలో అంత మార్పు ఏల?
X
కొందరు ప్రముఖుల తీరు సపరేటుగా ఉంటుంది. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించుకున్నా.. సమాధానం లభించని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తన తీరుతో అందరిని ఆశ్చర్యపరిచారు. ఎప్పటిలానే ఒక అంశంలో ఆయన వైఖరిని అందరూ చర్చించుకునేలా చేసింది. ఇంతకీ అదేమంటే.. ఆయన ముఖానికి మాస్కు ధరించటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జగన్ కు.. మాస్కుకు పెద్ద లంకె ఉండదు. కరోనా దెబ్బకు వీవీఐపీలు.. అత్యున్నత స్థానాల్లో ఉండే వారు తప్పనిసరిగా వినియోగించే మాస్కు విషయంలో మొదటి నుంచి తనదైన రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ముఖానికి మాస్కు పెట్టుకోవటంపై ఆయన భిన్నమైన తీరును ప్రదర్శించటం తెలిసిందే.

కార్యక్రమం ఏదైనా సరే.. సీఎం జగన్.. ఆయనతో పాటు ఉన్న చాలామంది మాస్కులు పెట్టుకోకుండా ఉండేవారు. తాను సురక్షితంగా ఉన్నట్లుగా ఆయన వ్యవహరించేవారు. మాస్కు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనటంపై ఆందోళన కూడా వ్యక్తమయ్యేది. కానీ.. జగన్ మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరించేవారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన ముఖానికి మాస్కు ధరించటం తెలిసిందే. అది కూడా రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. అత్యున్నత స్థాయి నేతల్ని కలిసినప్పుడు ఆయన మాస్కు ధరించే వారు. మిగిలిన సందర్భాల్లో మాత్రం మాస్కు ధరించేవారు కాదు.

ఆయన తీరుపై ఆందోళన వ్యక్తం కావటం.. ఆయన తీరుతో కరోనా ముప్పు పొంచి ఉందని.. డేంజర్ గేమ్ ఆడుతున్నారన్న మాట వినిపించేది. ఇంటా.. బయటా.. ఎక్కడైనా సరే.. మాస్కు విషయంలో మాత్రం ఆయన తన తీరును మార్చుకోలేదు. మొదటి వేవ్ లోనూ.. సెకండ్ వేవ్ లోనూ ఆయన ఒకే తీరును ప్రదర్శించారు. మరికొన్ని సందర్భాల్లో ఆయన చుట్టు ఉన్న వారు మాస్కు ధరించినా.. సీఎం జగన్ మాత్రం మాస్కు పెట్టుకునే వారు కాదు. అలాంటి ఏపీ ముఖ్యమంత్రి.. తన తీరుకు భిన్నంగా ముఖానికి మాస్కుపెట్టుకొని కార్యక్రమానికి పాల్గొనటం.. ఆ ప్రోగ్రాం ఆద్యంతం ఆయన ముఖానికి మాస్కు పెట్టుకొని ఉండటం ఆసక్తికర చర్చకు తెర తీసింది.

ఇంతకాలం మాస్కు పెట్టని సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మాత్రం ఎందుకు పెట్టారు? దానికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించటం.. ప్రాజెక్టు పనులు ఏ మేరకు వచ్చాయన్న విషయాన్ని రివ్యూ చేయటం తెలిసిందే. మంత్రులు.. పలువురు నేతలు.. ఉన్నత స్థాయి అధికారులు వెంట రాగా.. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీసి.. వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రోగ్రాం మొత్తం తన ముఖానికి మాస్కు తీయకుండా టూర్ ను పూర్తి చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

రెగ్యులర్ గా మాస్కు పెట్టుకోని ఆయన.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంలో ఎందుకు మాస్కు ధరించినట్లు? అన్న ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి ఆసక్తికర సమాధానం లభిస్తోంది. ఏపీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిని మాస్కు ధరించాలని అధికారులు స్పష్టం చేశారని తెలుస్తోంది.

మాస్కు ధరించటానికి ఆసక్తి ప్రదర్శించలేదని.. అయితే.. అత్యున్నత స్థాయి అధికారులు అదే పనిగా.. మాస్కు పెట్టుకోవాలని చెప్పటంతో ఆయన తన తీరుకు భిన్నంగా ముఖానికి మాస్కు పెట్టుకోవటం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మాస్కు పెట్టుకోవటంతో.. తాజా టూర్ లో పాల్గొన్న వారంతా ముఖానికి మాస్కుపెట్టుకున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన మంత్రి కన్నబాబు మాత్రం మాస్కు పెట్టుకున్నారే కానీ.. ముక్కుకిందకు మాస్కును జార్చేసి తిరగటం కనిపించింది. మొత్తానికి సీఎం జగన్ ముఖానికి మాస్కు వ్యవహారం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.