Begin typing your search above and press return to search.

మీడియాపై సర్జికల్ స్ట్రైక్స్ మోడీ వ్యూహం?

By:  Tupaki Desk   |   26 July 2020 6:50 AM GMT
మీడియాపై సర్జికల్ స్ట్రైక్స్ మోడీ వ్యూహం?
X
సర్జికల్ స్ట్రైక్స్ అన్నంతనే ప్రధాని మోడీ గుర్తుకు వచ్చేస్తారు. ప్రత్యర్థుల్ని.. శత్రువులకు చుక్కలు చూపించే విషయంలో మోడీ అనుసరించే వ్యూహాలు గతంలో పని చేసిన ప్రధానమంత్రులకు భిన్నంగా ఉంటాయి. ఒకసారి ఫిక్స్ అయితే.. వెనక్కి తగ్గకపోవటం.. తర్వాత ఏం జరుగుతుందన్న అంశం గురించి ముందే ఎక్కువగా ఆలోచించే కన్నా.. వచ్చిన తర్వాత ఫేస్ చేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఈ మైండ్ సెట్ కారణంగానే పెద్దనోట్ల రద్దు.. సర్జికల్ స్ట్రైక్స్.. అయోధ్య వివాదం.. కశ్మీర్ అంశం.. ఇలా సంచలన నిర్ణయాల్ని తీసుకోగలుగుతారని చెప్పాలి.

మొదటి టర్మ్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని.. రెండో టర్మ్ కు ఆయన ప్రాభవం తగ్గుతుందన్న అంచనాలకు భిన్నంగా తన సత్తా చాటిన మోడీ.. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే.. కొన్ని అంశాల్ని వ్యవస్థీకృతం చేసిందో.. అలాంటి వాటి విషయంలో నాలుగు ఆకులు మోడీషాలు ఎక్కువేనని చెప్పక తప్పదు. తమకు పట్టుచిక్కని రంగాల సంగతి చూసేవారు.. తాజాగా మీడియా మీద ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.

నిజానికి 2014 ఎన్నికలకు రెండేళ్ల ముందే మీడియా మీద ఫోకస్ చేయటాన్ని మర్చిపోకూడదు. ఎవరు అవునన్నా.. కాదన్నా భారతదేశ మీడియాలో వామపక్ష భావజాలం కొన్ని దశాబ్దాలుగా వస్తున్నదే. అదెంత బలమైన కోటరీ అంటే.. అలా ఎలా? అన్న ప్రశ్న వేయటాన్ని పాత్రికేయ ఆస్తిత్వాన్ని నిలదీసేంత ఘోరమైన అపరాధాన్ని కట్టబెట్టేంత. అంతటి ఉక్కుగోడల్ని బద్ధలు కొట్టానికి మోడీషాలాంటి వారికి కాస్త సమయం పట్టింది. ప్రస్తుతానికి పట్టు చిక్కినా.. పూర్తిస్థాయిలో మాత్రం రాలేదని చెప్పాలి.

ఇంగువ కట్టిన గుడ్డ మాదిరి.. జర్నలిజంలోకి రావటమంటే వామపక్ష భావజాలం మస్ట్ అన్న ధోరణికి భిన్నమైన ఆలోచనలు మొగ్గ తొడిగేలా చేయటం కోసం మోడీషాలు చాలానే కష్టపడ్డారు. లెఫ్ట్ భావజాలం ఎలానో.. రైట్ భావజాలం లేకపోతే ఎలా? అన్న ప్రశ్నను సంధించటానికి అరవైఏళ్లకు పైగా పట్టటం ఒకటైతే.. అదంతా మోడీషాల పుణ్యం కావటం మరో ఎత్తుగా చెప్పాలి. వామపక్ష పాత్రికేయ ఉక్కుసంకెళ్లను తెగ్గొట్టేందుకు తాజాగా మోడీ భారీ ప్లానింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.

విభజించు పాలించన్నట్లుగా తెల్లోడు అప్పుడెప్పుడో అమలు చేసిన పద్దతిని తాజాగా మీడియాలో అమలు చేయాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా ‘ఎడిటర్స్ గిల్ట్’ ను రెండు ముక్కలయ్యేందుకు పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఒకరకంగా ఇది మీడియా మీద మోడీ మాష్టారి సర్జికల్ స్ట్రైక్స్ గా అభివర్ణిస్తే.. ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుంటున్న రైట్ వింగ్ జర్నలిస్టులు.. వామపక్ష పాత్రికేయం మీద జరుపుతున్న మెరుపుదాడిగా అభివర్ణిస్తున్నారు. రైట్ వింగ్ ను ఒక దరికి చేర్చేందుకు అర్నాబ్ లాంటోళ్లు నాయకత్వం వహిస్తున్నారట. వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్న అభయంతోనే జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ సాగుతున్న ఎడిటర్స్ గిల్డ్ రెండు ముక్కలు అవుతుందని.. కొత్తగా నేషనలిస్ట్ ఎడిటర్స్ గిల్డ్ పేరుతో పురుడు పోసుకుంటున్నట్లు తెలుస్తోంది.