Begin typing your search above and press return to search.

క‌విత చేతిలో ఆ ఇద్ద‌రి నేత‌ల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌...!

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:00 AM GMT
క‌విత చేతిలో ఆ ఇద్ద‌రి నేత‌ల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌...!
X
రాజ‌కీయాలు అంత‌ సుల‌భంగా అంతుబ‌ట్ట‌వు. ఎవ‌రి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవ‌రి క‌ద‌లిక వెనున ఎలాంటి ప్ర‌యోజ‌నం దాగి ఉందో తెలియ‌దు. పార్టీలో చేర్చుకునేవారి ప్ర‌యోజ‌నాలు వేరు.. చేరేవారి అవ‌స‌రాలు వేరు. ఇందులో ఏం కొంచెం తేడా వ‌చ్చినా..ఇక తెగ‌దెంపులే. మ‌న నేతలు పైపైకి ఎన్నిచెబుతున్నా..లోలోప‌ల మాత్రం జ‌రిగేది ఇదే.. తెలంగాణ‌లో అసెంబ్లీ - పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర‌ పార్టీల నుంచి ఎడాపెడా అధికార పార్టీలోకి వ‌చ్చారు. ఒక‌రేమో పిలవ‌కుండానే వ‌స్తే.. మ‌రొక‌రేమో.. ఇంటిదాకా వ‌చ్చి ఆహ్వానిస్తేనే వెళ్లారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు ఇందూరు నేత‌లు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. త‌ల‌రాత‌మారేదెన్న‌డో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పరిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా ఉండ‌డంతో సైలెంట్‌ గా ఉండిపోతున్నారు.

నిజామాబాద్ (ఇందూరు) జిల్లాలో మాజీ స్పీక‌ర్ సురేశ్‌ రెడ్డి - మండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌ రావు.. ఇద్ద‌రు కూడా బ‌ల‌మైన నేత‌లే. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా సురేశ్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి - అధికార టీఆర్ ఎస్‌ లో చేరి - అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. ఇక టీఆర్ ఎస్ కీల‌క నేత ఆహ్వానం మేర‌కు వెంక‌టేశ్వ‌ర్‌ రావు టీఆర్ ఎస్‌ లో చేరారు. అయితే.. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కూతురు క‌విత భారీ మెజార్టీతో గెల‌వ‌డం కోస‌మే.. వీరిద్ద‌రినీ తీసుకున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో త‌మ‌కు ఏదో ఒక ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కంతో సురేశ్‌ రెడ్డి - మండ‌ల వెంక‌టేశ్వ‌ర్‌ రావు గులాబీ కండువాలు క‌ప్పుకున్నారు.

క‌విత గెలుపు కోసం వీరిద్ద‌రు ఈ ఎన్నిక‌ల్లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేశారు. అయితే.. ఊహించ‌ని విధంగా నిజామాబాద్ పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ క‌విత బీజేపీ అభ్య‌ర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. దీంతో గులాబీ అధినేత కేసీఆర్ తీవ్ర షాక్‌ కు గుర‌య్యారు. అయితే.. నిజానికి.. సురేశ్‌ రెడ్డి - మండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌ రావుల‌కు కీల‌క ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని ఎన్నిక‌లకు ముందు అంద‌రూ అనుకున్నారు. ఎమ్మెల్సీ - రాజ్య‌స‌భ సీట‌న్నా ద‌క్క‌క‌పోత‌దా.. అని వీరిద్ద‌రు కూడా అనుకున్నారు. కానీ.. కేసీఆర్ అనుకున్న‌ట్లు క‌విత గెల‌వ‌లేదు. దీంతో వీరిద్ద‌రికి ప‌ద‌వులు ఇచ్చే ఆలోచ‌న‌ను కూడా కేసీఆర్ ప‌క్క‌న‌ప‌డేసిన‌ట్టు తెలుస్తోంది.

అంటే.. క‌విత ఓట‌మి.. సురేశ్‌ రెడ్డి - మండ‌వ‌ల రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌శ్నార్థకం చేసింద‌న్న‌మాట‌. ముందుగా.. క‌విత‌కు ఏదో ఒక మంచి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన త‌ర్వాతే.. వీరి గురించి కేసీఆర్ ఆలోచించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ సీటును కూడా న‌ల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డికి కేటాయించారు. ఈ నేప‌థ్యంలో సురేశ్‌ రెడ్డి - మండ‌వ‌లు కేసీఆర్‌ పై ఆశ‌లు కొట్టేసుకున్న‌ట్లు వారి అనుచ‌రులు గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌.