Begin typing your search above and press return to search.

హోటల్ రూమ్ కోసం 11 కోట్లు వదులుకున్నాడా...?

By:  Tupaki Desk   |   31 Aug 2020 9:15 AM IST
హోటల్ రూమ్ కోసం 11 కోట్లు వదులుకున్నాడా...?
X
మరో 20 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా సీఎస్కే స్టార్ ఆటగాడు సురేష్ రైనా అర్ధాంతరంగా సీజన్ నుంచి వైదొలిగి ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల వల్లే సురేష్ రైనా ఇంటికి వచ్చాడని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. దోపిడీ దొంగల దాడిలో సురేష్ రైనా మేనత్త భర్త చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకే రైనా ఇండియా చేరుకున్నాడని ప్రకటించారు. అయితే అది అసలు కారణం కాదని తెలుస్తోంది. దుబాయ్ లో సురేష్ రైనాకు కేటాయించిన హోటల్ రూమ్ విషయంలో తలెత్తిన విభేదాల వల్లే అతడు అసంతృప్తి చెంది మొత్తం లీగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రైనా వైదొలిగినా అతడి స్థానంలో మరొకరిని భర్తీ చేస్తామని సీఎస్కే జట్టు యాజమాని శ్రీనివాస్ చెప్పారు. అతడికి విజయగర్వం తలకెక్కిందని పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే సీఎస్కే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని వంటి విజయవంతమైన సారధి ఉండడంతో పరిస్థితులను చక్కబెడుతున్నాడు.

చెన్నైలో తన బంధువు మృతిచెందగా ఆ కారణం చూపించి రైనా స్వ దేశానికి తిరిగి వచ్చాడు. అయితే దుబాయ్ లో హోటల్లో తనకు కేటాయించిన గది విషయమై అసంతృప్తి చెంది రైనా ఇండియాకు చేరుకున్నాడు. సీఎస్కే జట్టు ధోనీకి అన్ని సౌకర్యాలతో కూడిన గదిని కేటాయించగా, తనకు కేటాయించిన గదిలో ఎటువంటి వసతులు లేవని.. తనకు కూడా ధోనికి కేటాయించినట్లు అన్ని వసతులు కల్పించాలని జట్టు నిర్వాహకులతో రైనా పేచీ పెట్టినట్లు తెలిసింది. దీనిపై ధోని కూడా రైనాతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నిబంధనల ప్రకారం ఐపీఎల్ మొదలవడానికి ముందు అన్ని జట్ల ఆటగాళ్లను క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ లో ఉండడానికి కూడా రైనా ఇబ్బంది పడ్డాడని, దీనికితోడు ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టుల్లో సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు సహా మొత్తం 12 మందికి కరోనా రావడంతో రైనా తీవ్రంగా ఆందోళన చెందినట్లు జట్టు వర్గాలు తెలిపాయి.

గది విషయమై వివాదం, జట్టులో చాలా మందికి కరోనా రావడంతో రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ' క్రికెటర్లు తామే గొప్ప అన్నట్టు భావిస్తున్నారు. సీఎస్కే జట్టు ఓ కుటుంబం లాంటిది. సీనియర్లు ఎలా సర్దుకోవాలలో నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిస్తే మాకు అక్కర్లేదు. వెళ్ళిపోవచ్చు 'అని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువుల మరణించగా రైనా స్వదేశం తిరిగి వచ్చాడని అనుకోగా, ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో తిరిగి వెళ్లడానికి అవకాశం ఉన్నప్పుడు..సిరీస్ మొత్తం నుంచి వైదొలగడం ఎందుకని అప్పట్లోనే అనుమానాలు తలెత్తాయి. అవి ప్రస్తుతం నిజమయ్యాయి.