Begin typing your search above and press return to search.

వీలుంటే ఈ సీజన్లోనే ఆడతా.. శ్రీనితో విభేదాల్లేవ్ : రైనా

By:  Tupaki Desk   |   3 Sept 2020 9:30 AM IST
వీలుంటే ఈ సీజన్లోనే ఆడతా.. శ్రీనితో విభేదాల్లేవ్ : రైనా
X
వీలుంటే ఈ ఐపీఎల్ సీజన్లో మళ్లీ ఆడతానని సీఎస్కే స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ప్రకటించాడు. ఈ నెల 20 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా సురేష్ రైనా ఐపీఎల్ నుంచి వైదొలగి ఇండియాకు చేరుకున్నాడు. సమీప బంధువులపై దోపిడీ దొంగల దాడి వల్లే రైనా సీజన్ నుంచి వైదొలిగి ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చిందని ముందు అంతా అన్నారు. ఆ తర్వాత దుబాయిలో హోటల్ లో తనకు కేటాయించిన గది విషయమై రైనా అసంతృప్తి చెందాడని వార్తలు వచ్చాయి.

ఆ కారణంగా వివాదం జరగడంతోనే రైనా జట్టు నుంచి వీడాడని అన్నారు. ఈ వార్తల నేపథ్యంలో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ కూడా రైనాపై పరోక్షంగా విమర్శలు చేశాడు. క్రికెటర్లు తామే గొప్ప అనే భ్రమలో ఉన్నారని కామెంట్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆయన మీడియా తన మాటలను తప్పుగా అర్థం చేసుకుందని అన్నాడు. రైనా విజయాల గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఈ నేపథ్యంలో సురేష్ రైనా కూడా స్పందించాడు. తనకు సీఎస్కే జట్టు యజమానితోఎలాంటి విభేదాలు లేవని.. ఆయన తనకు తండ్రితో సమానమని పేర్కొన్నాడు. తన కుటుంబం పై జరిగిన దాడి వల్లే ఇండియాకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవరైనా 12.5 కోట్లు వదులుకుంటారా అని రైనా ప్రశ్నించారు. తనకు సీఎస్కే జట్టుతో రూ.12.5 కోట్ల కాంటాక్ట్ ఉందన్నారు. కాగా రైనా వ్యాఖ్యలపై శ్రీనివాసన్ కూడా స్పందించాడు. రైనా చెప్పింది నిజమేనని.. అతన్ని తన కొడుకులా చూసుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా.. తన సమస్యలు పరిష్కారమై ఒకవేళ వీలు కుదిరితే ఈ సీజన్లోనే చెన్నైకి ఆడతానని సురేష్ రైనా ప్రకటించారు.