Begin typing your search above and press return to search.

రైల్వే మంత్రిని పెళ్లికి పిలిచిన ప్రయాణికుడు

By:  Tupaki Desk   |   22 April 2016 9:59 AM GMT
రైల్వే మంత్రిని పెళ్లికి పిలిచిన ప్రయాణికుడు
X
సురేశ్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ మంత్రిత్వ శాఖలో చాలామార్పులొచ్చాయి. ముఖ్యంగా ప్రయాణికులకు నేరుగా మంత్రి సహా, మంత్రిత్వ శాఖ అధికారులతోనూ అనుబంధం ఏర్పడుతోంది. ప్రయాణికులు తమకు ఏవైనా సమస్యలుంటే వెంటనే రైల్వేమంత్రికో, అధికారులకో ట్విట్టర్ లో కంప్లయింట్ చేస్తున్నారు... వెంటనే సమస్య పరిష్కారమవుతోంది. ఇలా ఎన్నో మార్పులు రైల్వేల్లో వచ్చాయి. రైల్వే మంత్రి కూడా అప్పుడప్పుడు తాను స్వయంగా రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఆయన ముంబయిలో లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడు ఆయన్ను తన పెళ్లికి రావాలంటూ శుభలేఖ అందించాడు. దాన్ని ఆయన స్వీకరించి వస్తానని చెప్పారు.

ముంబైలోని కుర్రే రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసేందుకు బయలుదేరిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు - కాన్వాయ్ ని వదిలి రైలెక్కారు. రోడ్డుపై వెళితే, మరింత ఆలస్యమవుతుందని భావించిన ఆయన ఛత్రపతి శివాజీ టర్మినస్ కు వెళ్లేందుకు లోకల్ రైలెక్కేశారు. తమ పక్కన స్వయంగా రైల్వే మంత్రి కనిపించడంతో, ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. రైల్లో ప్రయాణిస్తున్న వారితో మాట కలిపిన సురేష్ ప్రభు - వారికి మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో సలహాలు - సూచనలు కోరారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను దిగాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేవరకూ, ఆయన నిలబడే ఉన్నారని, కూర్చోవాలని సీట్ ఆఫర్ చేసినా సున్నితంగా నిరాకరించారని ప్రయాణికులు తెలిపారు. అంతలో ఓ ప్రయాణికుడు ఆయనకు పెళ్లి కార్డు కూడా ఇచ్చారు. తన ఇంట్లో వివాహ వేడుకకు రావాలని ఆహ్వానపత్రం అందించగా ఆయన చిరునవ్వుతో దాన్ని స్వీకరించారు.