Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో అడిగితేనే కొత్త రైల్వే జోన్ ఇస్తారేమో?

By:  Tupaki Desk   |   9 Dec 2015 9:14 AM GMT
ట్విట్టర్ లో అడిగితేనే కొత్త రైల్వే జోన్ ఇస్తారేమో?
X
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన మంచి పనులతో దేశాన్ని ఆకట్టుకుంటున్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్నవారు చెప్పే సమస్యలపై వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటున్నారు. తాజాగా డెహ్రడూన్ లోని ఏసీఎన్ స్కూలు పిల్లలు కొదరు శీతాకాల సెలవులు ఇచ్చేసరికి ఇళ్లకు వెళ్తున్నారు. హరిద్వార్ నుంచి హౌరా వెళ్లే కుంభ్ ఎక్స్ ప్రెస్ లో వారంతా ప్రయాణిస్తున్నారు. పొగమంచు దట్టంగా ఉండడంతో రైలు చాలా నెమ్మదిగా నడుస్తోంది. ఆ రైళ్లో ప్యాంట్రీ కార్ కూడా లేదు. దీంతో తినడానికి తిండి దొరక్క పిల్లలకు ఆకలి మొదలైంది. వారణాసి వచ్చేసరికి వారికి కడుపులో ఎలకలు పరుగెట్టాయి. ఎప్పటికి గమ్యం చేరుతామో తెలియని పరిస్థితి. దీంతో వారు ట్విట్టర్ లో తమ ఆకలికి కారణమైన పరిస్థితుల గురించి రైల్వే మంత్రికి కంప్లయింట్ చేశారు. అది చూసిన వెంటనే సురేశ్ ప్రభు స్పందించారు. వారికి భోజన ఏర్పాట్లు చూడాలంటూ అధికారులను ఆయన వెంటనే ఆదేశించారు. పిల్లలు ట్వీట్ చేసిన కొద్ది సేపట్లోనే ఆహారం - నీరు - కాఫీ వంటివన్నీ వారి వద్దకు వచ్చాయి.

రాత్రి 10 గంటల సమయంలో సురేశ్ ప్రభు నుంచి స్థానిక రైల్వే అధికారులకు ఈ ఆదేశాలు రాగానే వారు హుటాహుటిన పిల్లలకు భోజన ఏర్పాట్లు చేశారు. కాగా సురేశ్ ప్రభు ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఇంకో ప్రయాణికురాలి సమస్యకూ ఇలాగే సత్వర పరిష్కారం చూపించారు. రైల్వేల్లో కొత్త ట్రెండును సృష్టిస్తున్న ఈ రైల్వే ప్రభు ఏపీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ను మాత్రం ఎందుకో ఇవ్వడం లేదు. లేదంటే ట్విట్టర్ లో అడిగితేనే ఇస్తారేమో మరి.