Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ఇంకో షాక్ ఇచ్చారు తెలుసా?

By:  Tupaki Desk   |   22 May 2016 5:22 AM GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ఇంకో షాక్ ఇచ్చారు తెలుసా?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ‌రుస షాక్‌ లు త‌గులుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని దాదాపుగా తేల్చేసిన కేంద్ర ప్ర‌భుత్వం ఇపుడు ప్రత్యేక రైల్వే జోన్ రూపంలో మ‌రో షాక్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్ల‌డించారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో రైల్వే శాఖ గత రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ఢిల్లీలో విలేఖరులకు వివరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ను ఏర్పాటుకు సంబంధించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

‘విభజన చట్టం ప్రకారం ఏపీలో ప్రత్యేక రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి’ అని చెప్పారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయనేది మాత్రం ఆయన వివరించలేదు. ఏపీలో ప్రత్యేక రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేయటంపై ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయని సురేష్ ప్రభు వెల్లడించారు. ప్రత్యేక రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేసేందుకు దీనితో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. చర్చలు ఎప్పుడు పూర్తవుతాయి - రైల్వే శాఖ ఎప్పటిలోగా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తుందనేది చెప్పలేదు. ప్రత్యేక జోన్‌ ను ఏర్పాటుకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని రైల్వే మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వేకు 886 కోట్ల రూపాయల ఆదాయం వస్తే గడిచిన రెండు సంవత్సరాల్లో 2195 కోట్ల రూపాయలను ఏపీలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేశామని రైల్వే మంత్రి వివరించారు.

రైల్వే శాఖ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షచూపుతోందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో పెండింగ్‌ లో ఉన్న కాజీపేట కోచ్ - వ్యాగన్ల కార్మాగారం నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలోనే సమకూరుస్తామన్నారు. కాగా రైల్వే కేటాయింపులు ఏపికి 148 శాతం - తెలంగాణకు 273 శాతం పెరిగాయన్నారు. తెలంగాణకు ఇచ్చిన రెండు కొత్త ప్రాజెక్టులు కాజీపేట్-బలార్ష మూడో లైను మిగతా పనులకు 2020 కోట్లు - సికింద్రాబాద్-మహబూబ్‌ నగర్ లైను నిర్మాణం పనులకు 1200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సురేష్ ప్రభు తెలిపారు.