Begin typing your search above and press return to search.

అర‌టిప‌ళ్ల ఉత్స‌వానికీ బాబును ఆహ్వానించారే

By:  Tupaki Desk   |   25 Nov 2017 5:57 AM GMT
అర‌టిప‌ళ్ల ఉత్స‌వానికీ బాబును ఆహ్వానించారే
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఓ అనూహ్య‌మైన ఆహ్వానం ల‌భించింది. ఇటీవ‌ల ఆయ‌న‌కు దేశంలో ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌రిగినా పిలుపులు అందుతున్నాయి. నెల‌లో నాలుగైదు రోజులు ఏవో ఒక కార్య‌క్ర‌మాల పేరుతో ఆయ‌న టూర్లు వెళ్లొస్తున్నారు. తాజాగా కేర‌ళ నుంచి కూడా ఇలాంటి ఆహ్వాన‌మే ఒక‌టి బాబుకు అందింది. అయితే, ఇదేదో పెట్టుబ‌డుల స‌ద‌స్సో.. ప్రాంతీయ స‌ద‌స్సో కాదు. కేవ‌లం అర‌టి ప‌ళ్ల ఉత్స‌వం! దీనికి సంబంధించి బాబును ఆహ్వానించేందుకు ఏకంగా మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపీ అమ‌రావ‌తికి వ‌చ్చి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. దాదాపు 15 నిముషాల పాటు బాబుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బాబును ఆయ‌న రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న అర‌టి ప‌ళ్ల ఉత్స‌వానికి ఆహ్వానించారు. దేశంలో అర‌టి ప‌ళ్ల ఉత్స‌వం ఏటా నిర్వ‌హించేదే. అయితే, ఈ సారి కేర‌ళ నిర్వ‌హిస్తోంది.

ఈ సంద‌ర్భంగా సురేష్ గోపీ మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారిగా ఏపీ రాజధాని అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబును సచివాలయంలో ఆయన కలిశారు. కేరళలో జరిగే జాతీయ బనానా ఫెస్టివల్‌కు చంద్రబాబును ఆహ్వనించిన‌ట్టు చెప్పారు. 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు తన సొంత గ్రామం కల్లియార్‌లో జరగనున్న జాతీయ అరటిపళ్ల ఉత్సవానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేతలు, అరటి రైతులు హాజరవుతారని చెప్పారు.

దేశంలో అరటి ఉత్పత్తిలో ఏపీ అగ్ర స్థానంలో ఉన్నందున.. ముఖ్య అతిథిగా పాల్గొనాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానిస్తామన్నారు. ఈ ఫెస్టివల్ లో 457 రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయి. కల్లియార్ గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్ర సంస్థల భాగస్వామ్యంతో సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ సోషల్‌ యాక్షన్‌(సీఐఎస్‌ఎస్‌ఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా, ఈ ఆహ్వానంపై టీడీపీ శ్రేణుల్లో అప్పుడే ఆనందం నెల‌కొనడం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మం పెద్ద సంచల‌న‌మేమీ కాద‌న్న‌ది నేత‌ల అభిప్రాయంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు దీనికి వెళ్తారో లేదో చూడాలి.