Begin typing your search above and press return to search.

పార్లమెంటు కబుర్లు: హీరోయిన్లు, చీరలు గురించే

By:  Tupaki Desk   |   8 Jan 2016 11:20 AM GMT
పార్లమెంటు కబుర్లు: హీరోయిన్లు, చీరలు గురించే
X
పార్ల‌మెంటు అంటే దేశంలో అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌. దాదాపు 110 కోట్ల భార‌త‌దేశ జ‌నాభాకు ప్రాతినిధ్యం వ‌హించే అత్యున్న‌త ప్ర‌జాప్రతినిధులు కొలువు దీరిన‌ వేదిక‌. ఇంత కీర్తి క‌లిగిన ఉన్న‌పార్లమెంట్ స‌మావేశాలు అంటే స‌హ‌జంగానే దేశ సమస్యలపై చర్చిస్తార‌నే భ‌రోసా ఉంటుంది. దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకుపోయేందుకు ఏంచేయాలి, ప్ర‌జ‌ల అవ‌స‌ర‌లేంటి, వాటిని తీర్చేందుకు చేయ‌వ‌ల్సిన కార్యాచ‌ర‌ణ‌...ఇలాంటివి ఎన్నో చ‌ర్చిస్తార‌ని మ‌నం అనుకుంటాం. కానీ పార్ల‌మెంటులో అవేం చ‌ర్చించ‌ర‌ట‌. క్లాస్‌ రూము ముచ్చట్లలాగా, అమ్మ‌ల‌క్క‌ల సంబురాల‌యిన‌...మీ చీర ఎక్కడ తెచ్చారు? నా చీర ఎలా ఉంది? వ‌ంటి గుసగుసలుంటాయట‌. ఇవ‌న్నీ మేం ఎలా చెప్తున్నా మంటే.. సాక్షాత్తు పార్ల‌మెంటు హాజ‌ర‌వుతున్న ఎంపీగారు ఈ మాట‌లన్నీ చెప్పారు కాబ‌ట్టి.

ఎన్సీపీ అధినేత‌ - మ‌హారాష్ర్ట మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్ కూతురు సుప్రియా సూలే. మ‌హారాష్ర్ట నుంచి ఎంపీగా ఎన్నిక‌యిన సుప్రియా ఆ రాష్ర్టంలోని నాసిక్‌ లోని ఆనందిచా ఉత్సవ్‌ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యువ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్‌ లో పిచ్చాపాటి ముచ్చట్ల గురించి చెప్పుకొచ్చారు. పార్ల‌మెంటులో సుదీర్ఘ చర్చల వల్ల బోరు కొడుతుందని విద్యార్థులతో సుప్రియా వ్యాఖ్యానించారు. సభలో టాపిక్ సరిగా లేనప్పుడు తామే టాపిక్‌ ను చీరలపైకి మారుస్తామని ఆమె అన్నారు. క్లాస్ రూమ్‌ లో మీరు పెట్టే ముచ్చట్లలాగే మేము కూడా పిచ్చాపాటి ముచ్చట్లు పెడుతామని ఆమె అన్నారు. దీపికా పదుకునే సూపర్ ఉంది కదా, బాజీరావ్ మస్తానీలో దీపిక కేక అంటూ మీరు క్లాస్‌ లో బాతాఖానీ కొట్టినట్టే మేమూ పార్లమెంట్‌ లో చీరల గురించి మాట్లాడుతామని ఆమె విద్యార్థులతో అన్నారు. చీరల గురించి, సభలో చర్చల గురించి ఆమె మాట్లాడుతుంటే విద్యార్థులంతా కేరింతలతో ఎంజాయ్ చేశారు.

అయితే సుప్రియా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రియా వ్యాఖ్య‌లతో పార్లమెంట్ సమావేశాలు ఎంత‌ వృధాగా సాగుతున్నాయో అర్థ‌మ‌వుతోంద‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్సీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చేస్తూంటే సభలో చర్చల కన్నా సరదా ముచ్చట్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. చట్టసభ ప్రతినిధులు దేశ ప్రజల శ్రేయస్సును అంతగా ఆలోచించడం లేదని సుప్రియ మాటల్లో అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.