Begin typing your search above and press return to search.

నీట్, జేఈఈ పరీక్షలపై సుప్రీం సంచలన తీర్పు !

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:20 PM IST
నీట్, జేఈఈ పరీక్షలపై సుప్రీం సంచలన తీర్పు !
X
NEET ,. JEE పరీక్షల పై సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ లో ఈ రెండు పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో సుప్రీం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కొట్టేసింది. దీనితో కేంద్రం ప్రకటించిన డేట్స్ లో వచ్చే నెలలో నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగా జరగబోతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలను ఈ సమయంలో నిర్వహించడం సరికాదని, వాటిని వాయిదా వేయాలంటూ, 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులను ఈ నెల 6వ తేదీన పిటీషన్లను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్లు సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు వచ్చాయి. ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, విద్యార్థుల తరఫున అడ్వొకేట్ అలఖ్ తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలను చేశారు. విద్యార్థుల తరపున పరీక్షలు వాయిదా వేయాలంటూ అలఖ్ తన వాదనలు వినిపించగా .. జస్టిస్ అరుణ్ మిశ్రా అయన వాదనను తోసిపుచ్చారు.

కరోనా పై పోరాటం చేస్తూ ముందుకు పోవాలని , కేవలం వాయిదా వేసినంత మాత్రానా ఈ సమస్య ఇక్కడితో తీరిపోదు. పరీక్షలను వాయిదా వేస్తే .. దేశం చాలా నష్టపోతుందని, ఓ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోతారని, అది దేశానికీ , విద్యార్ధులకి అంత మంచిది కాదు అని అరుణ్ మిశ్రా తెలిపారు. నీట్, జేఈఈ పరీక్షలు దేశానికి ఓ మార్గదర్శకాన్ని చేస్తాయని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యుత్తు మాత్రమే కాదు.. దేశం కూడా దానిపై ఆధారపడి ఉందని అరుణ్ మిశ్రా అన్నారు. అలాంటి పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేయాలనుకోవడం సరికాదని అన్నారు. ఈ పిటీషన్లను కొట్టి వేస్తున్నట్లు తెలిపారు. దీనితో సెప్టెంబర్ లో ఈ పరీక్షలు నిర్వహించడానికి కేంద్రం సన్నధం అవుతుంది.