Begin typing your search above and press return to search.

2 నెలల్లో తేల్చేయాలి .. ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం ఆదేశాలు!

By:  Tupaki Desk   |   18 Sept 2020 2:40 PM IST
2 నెలల్లో తేల్చేయాలి .. ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం ఆదేశాలు!
X
ప్రజాప్రతినిధుల కేసుల విచారణకి కార్యాచరణ ప్రణాళికను వారంలోగా పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్ట్ లకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుత ప్రజాప్రతినిధులపై - మాజీ ప్రజాప్రతినిధులపై హేతుబద్ధంగా ఏర్పాటు చేసేందుకు వారం రోజుల్లోగా యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ - జస్టిస్‌ సూర్యకాంత్‌ - జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌ లతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశాలు జారీచేశారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటప్పుడు ఇప్పటికే వేగంగా విచారణ జరుగుతున్న కేసులను మరో కోర్టుకు బదిలీ చేయడం అవసరమో కాదో హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతంగా జరిగేలా ఆదేశాలివ్వాలని ప్రముఖ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రధాన న్యాయమూర్తులు తమ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక బెంచ్‌ ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం తెలిపింది. ఏడాది లోపు ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ, జిల్లా కో ప్రత్యేక కోర్టు తదితర సూచనలతో అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా దాఖలు చేసిన అఫిడవిట్‌ పై హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలను పంపాలని.. అవసరమైతే తమ సూచనలను కూడా జోడించాలని నిర్దేశించింది. సిటింగ్‌ - మాజీ ఎంపీలు - ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల జాబితాను తయారు చేయాలని - ముఖ్యంగా స్టే మంజూరైన కేసులను గుర్తించి తగిన బెంచ్ ‌లకు నివేదించాలని కోరింది. ‘కేసులపై స్టే కొనసాగించాలా లేదా అన్నది కోర్టు ముందుగా నిర్ణయించాలి. స్టే తప్పనిసరైతే అలాంటి కేసులపై రోజువారీ విచారణ జరిపి ఎటువంటి అనవసర వాయిదాలు లేకుండా రెండు నెలల్లో తేల్చేయాలని ఆదేశించింది.

అలాగే ఈ ఆదేశాలకు కరోనా ఏ మాత్రం అడ్డురాకూడదు అని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపే సౌలభ్యం ఉంది’ అని గుర్తుచేసింది. ఏదైనా కేసుల్లో శిక్షపడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలంటూ అమికస్‌ క్యూరీ చేసిన సూచనలపై సరైన సమయంలో ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం గా జరగాలని సుప్రీంకోర్టు గతంలో పలు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ముందుకు కదలకపోవడంతో నిర్దిష్ట సమయంలోగా సత్వర విచారణ జరపాలని ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ 2016లో పిటిషన్‌ దాఖలు చేశారు. అదే ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. ఈ క్రమంలో కోర్టుకు సాయపడేందుకు సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియాను అమికస్‌ క్యూరీగా నియమించింది. దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులపై 4,442 పెండింగ్‌ కేసులు ఉన్నాయని.. అయితే అవినీతి నిరోధక చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై పెండింగ్‌ లో ఉన్న కేసుల జాబితా ఇంకా రావలసి ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.

ఎన్నికైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులను వేగంగా విచారించడం వెనుక ప్రధాన ఉద్దేశం.. దేశ రాజకీయాల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేరచరితులను ఏరివేయడమే కాదని.. విచారణను సమర్థంగా అడ్డుకునేందుకు ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని పలుకుబడిని ప్రదర్శించకుండా చూడడం కూడానని జస్టిస్‌ రమణ ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రతినిధులు ఓటర్ల విశ్వాసానికి నమ్మకానికి ప్రతిరూపాలు. అందువల్ల తాము ఎన్నుకుంటున్న వారి నేపథ్యం తెలుసుకోవడం ప్రజలకు అవసరం. ప్రస్తుత విచారణ ప్రధాన లక్ష్యం ప్రజాస్వామికంగా ఎన్నికైన సంస్థల స్వచ్ఛతను కాపాడడమే అని ధర్మాసనం తెలిపింది.