Begin typing your search above and press return to search.

ఎస్ఈసీ నియామకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 March 2021 3:30 PM GMT
ఎస్ఈసీ నియామకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చకు దారితీసింది. గోవా ఎన్నికల కమిషనర్ గా ఆ రాష్ట్ర న్యాయ కార్యదర్శికి ఆ రాష్ట్రప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.అయితే ఈ నియామకంపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. గోవా ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా.. కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల కమిషనర్లుగా ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ గా ఉండే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కావడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనని సుప్రీంకోర్టు ఘాటు విమర్శలు చేసింది. ఏ రాష్ట్రం కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు భంగమని తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం ఉన్న అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎస్ఈసీగా స్వతంత్రత గల వ్యక్తి ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది.ఏపీలో ఎస్ఈసీ తొలగింపు.. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి నియమించిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.