Begin typing your search above and press return to search.

అంబులెన్స్ ఛార్జీలపై రాష్ట్రాలకి సుప్రీం కీలక ఆదేశాలు!

By:  Tupaki Desk   |   12 Sept 2020 12:30 PM IST
అంబులెన్స్ ఛార్జీలపై రాష్ట్రాలకి సుప్రీం కీలక ఆదేశాలు!
X
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీల పై సుప్రీంకోర్టు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉండే అంబులెన్స్ సేవలకు ఛార్జీలను సహేతుకంగా ఉంచాలని, కరోనా రోగులకు సహేతుకమైన అంబులెన్స్ ఖర్చును రాష్ట్రాలు నిర్ణయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంబులెన్సుల సామర్థ్యాన్ని ప్రభుత్వాలు పెంచాలని, దీనికి తగిన చర్యలను త్వరలోనే తీసుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది. రోగులను చేర్చడానికి అంబులెన్స్ సేవలను పెంచాలని కోరింది.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్ ఛార్జీల పెంపుపై దాఖలైన పిల్‌పై జస్టిస్ అశోక్‌భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కాకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్రాలు న్యాయబద్ధమైన ధరలకు సేవలు అందించాలని సూచించింది. ప్రతి జిల్లాలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలని , వాటి సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్ధమైన ఛార్జీలను వసూలు చేయాలనీ , అంబులెన్స్‌ సేవల కోసం రూ.7వేలు వసూలు చేస్తున్నారని, కొన్నిసార్లు రూ.50వేల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇతరుల దయతో అంబులెన్స్‌లు పొందాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని , ఈ పరిస్థితిలో మార్పు రావాలని సుప్రీం అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీచేసింది.