Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సుప్రీం సూటి ప్రశ్న.. రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   20 March 2021 4:21 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సుప్రీం సూటి ప్రశ్న.. రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?
X
సామాజికంగా.. ఆర్థికంగా.. ఇతర కారణాలతో వెనుకబడిన వారిని పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్లు ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పదేళ్ల పాటు అమలు చేయాలని.. అనంతరం వాటిని సమీక్షించాలని చెప్పటం తెలిసిందే. అయినప్పటికీ రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు కొనసాగించటమే కాదు.. దాన్ని ఇంకెన్నాళ్లు అమలు చేయాలన్న అంశంపై మాత్రం ఎవరూ మాట్లాడరు. నిజానికి సామాజిక అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్థిక అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని.. రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

అగ్రవర్ణాల్లో పేదలు ఎంతోమంది ఉన్నారు. కానీ.. వారు పుట్టిన సామాజిక వర్గం కారణంగా రిజర్వేషన్లకు దూరంగా ఉండటంలో అర్థం లేదు. కానీ.. ఈ విషయాన్నిపాలకులు పట్టించుకోరు. రిజర్వేషన్ల మీద ప్రైవేటుగా జరిగే చర్చ మాదిరి.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్య.. ఉద్యోగాల్లో ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం కీలక ప్రశ్నను సంధించింది.

రిజర్వేషన్లు ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తలెత్తే అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. మారిన పరిస్థితుల్లో రిజర్వేషన్ల వ్యవహారాన్ని పున: సమీక్షించాలన్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా 50 శాతం కోటా ను ఉల్లంఘించిందన్నారు. ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారు? అని ప్రశ్నించింది. 50 శాతం పరిమితి లేకుంటే.. దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితి ఏమిటి? అన్న విషయం మీద వారి వాదన ఏమిటో చెప్పాలని పేర్కొంది. మరి.. దీనిపై ప్రభుత్వాలు ఏమని వాదనలు వినిపిస్తాయో చూడాలి.