Begin typing your search above and press return to search.

దేశ‌మంతా టెస్టుల ధ‌ర‌లు ఒకేలా ఉండాలి: ‌కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:40 PM IST
దేశ‌మంతా టెస్టుల ధ‌ర‌లు ఒకేలా ఉండాలి: ‌కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
X
దేశవ్యాప్తంగా వైర‌స్ విజృంభ‌ణ తీవ్రంగా ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనిపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప‌రీక్ష‌లు చేయ‌క‌పోవ‌డ‌మే కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణంగా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైర‌స్ టెస్టుల విష‌యంలో సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు రాష్ట్రాల‌ను ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా టెస్టుల ధ‌ర‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. దేశ‌వ్యాప్తంగా ఒకే విధంగా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష ధ‌ర ఉండాల‌ని.. దానికి గరిష్ట పరిమితి విధించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది.

చాలా ఆస్ప‌త్రుల్లో ఈ టెస్టింగ్ వ్యవహారం దారుణంగా ఉందని, వైర‌స్ మృతుల విషయంలో అవి పాటిస్తున్న వైఖరి గర్హనీయంగా ఉందని పత్రికల్లో వఛ్చిన వార్తల ఆధారంగా ఓ వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిల్‌పై కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ దీన్ని విచారిస్తోంది. దేశంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు వివిధ రకాలుగా టెస్టింగ్ రేట్లు నిర్ధారించాయని, అవి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించే విషయాన్ని కేంద్రం పరిశీలించాలని అత్యున్న‌త న్యాయ‌స్థానం సూచించింది. వైర‌స్ బాధితులు, వైర‌స్‌తో మృతి చెందినవారి విషయంలో ఆస్పత్రులు కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించేలా చూడాలని కేంద్రంతో బాటు రాష్ట్రాలను కూడా ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

ఈ వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌డంలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరి, లోక్ నాయక్ జయప్రకాశ్‌ నారాయణ్ ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యంపై కోర్టు మండిపడిన విష‌యం తెలిసిందే. టెస్టుల ఫలితాలను ప్రజలు, రోగులు నేరుగా సేకరించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని ఈ సంద‌ర్భంగా కోర్టు సూచించింది. హోం మంత్రిత్వ శాఖ మే 8వ తేదీన జారీ చేసిన తాజా ‘డిశ్చార్జి పాలసీ’ ని అన్ని రాష్ట్రాలు పాటించాలని ఈ బెంచ్ కోరినట్టు పిటిషనర్ తెలిపారు. వైర‌స్ బాధితుల విషయంలో మీరెలాంటి పద్ధ‌తులు పాటిస్తున్నారో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.