Begin typing your search above and press return to search.

టీడీపీ నేతల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ...ఏంటంటే ?

By:  Tupaki Desk   |   20 May 2020 12:50 PM GMT
టీడీపీ నేతల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ...ఏంటంటే ?
X
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను కల్పించడానికి జగన్ సర్కార్ తీసుకున్న చర్యలకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పుల్‌ స్టాప్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల అభ్యర్థులకు 59 శాతం వరకు టికెట్లను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

స్థానిక సంస్థల్లో బీసీ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం 59 శాతం రిజర్వేషన్ కోటాను కల్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్‌లకు నిర్వహించబోయే ఎన్నికల్లో దీనికి అనుగుణంగా టికెట్లను ఇచ్చి, బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని భావించింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను దాఖలు చేశారు.

బీసీలకు అత్యధిక సీట్లను కేటాయించడం రాజ్యాంగానికి విరుద్ధమని, రాష్ట్ర జనాభాలో 48.13 శాతం వరకే బీసీలు ఉన్నారని, వారికోసం 59 శాతం వరకు రిజర్వేషన్లను కల్పించడం సరికాదని వాదించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు పిటీషన్‌లో విజ్ఙప్తి చేశారు. టీడీపీ నేతలతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు ఇదే అంశంపై వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశారు. వాటన్నింటినీ ఒకే పిటీషన్ కింద సుప్రీంకోర్టు విచారించింది

2010లో దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చిందని, దాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరిస్తోందని తమ పిటీషన్లలో పేర్కొన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తరువాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. గతంలో తాము ఇదే న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు లోబడి తాము తమ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.