Begin typing your search above and press return to search.

అమ్మకు ఏమీ మిగలకుండా చేసిన ‘తీర్పు’

By:  Tupaki Desk   |   16 Feb 2017 6:42 AM GMT
అమ్మకు ఏమీ మిగలకుండా చేసిన ‘తీర్పు’
X
అంతులేని సంపద.. అంతకు మించిన అధికారం.. వీటన్నింటిని తలదన్నేలా కోట్లాదిమంది ప్రజల అభిమానం అమ్మగా కీర్తిని సొంతం చేసుకున్న పురుట్చితలైవి జయలలిత సొంతం. భౌతికంగా ఆమె ఉన్నప్పుడు పైన చెప్పినవన్నీ ఉన్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రి పాలై.. 75 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన అమ్మ.. శాశ్విత నిద్రలోకి జారిపోయారు. మెరీనా బీచ్ తీరంలో సమాధి స్థితిలో కనిపించని ఆమెకు తాజాగా భారీ శరాఘాతమే తగిలిందనుకోవాలి. అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పుతో.. చచ్చి బతికిపోయినట్లుగా చాలామంది భావించినా.. అది నిజం కాలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఆమె తన జీవితకాలంలో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల మీద.. తాజాగా వెలువడిన తీర్పు ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయేలా చేసిందని చెప్పాలి.

అక్రమాస్తుల్ని కూడబెట్టిన విషయం కోర్టుల్లో తేలిన నేపథ్యంలో.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న అమ్మ.. రానున్న రోజుల్లో చెదిరిపోవటం ఖాయం. ఎందుకంటే.. రానున్నరోజుల్లో ఆమె ఫోటోతో అధికారికంగా ఏమీ చేయలేని పరిస్థితి.. తీర్పు వెలువడని ముందు వరకూ అమ్మ లేకున్నా.. ఆమె ఫోటోతో బండి లాగించే పరిస్థితి. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె ఫోటోల్ని వినియోగించినా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ.. సుప్రీం తీర్పు నేపథ్యంలో అలాంటివి సాధ్యం కాకపోవచ్చు.

అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జయలలిత మీద చేసిన నేరారోపణలు రుజువు కావటం.. ఆమె దోషిగా నిరూపితమైన నేపథ్యంలో.. అధికారిక కార్యక్రమాల్లోనూ.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆమె ఫోటోను వినియోగించటం కష్టమనే మాట వినిపిస్తోంది. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నాఆమె ఫోటోను అధికారిక కార్యక్రమాల్లో వాడలేని పరిస్థితి. అంతేనా.. అమ్మకు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్రం మీద ఒత్తిడి తేవాలని భావిస్తున్న తమిళ తంబీలకు.. ఇకపై అదిక సాధ్యం కాదు.

అంతేనా.. అమ్మ పేరిట భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు పెట్టే అవకాశం లేదు. ఇంతేనా.. అమ్మ సమాధిని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రయత్నాలు ఇకపై ముందుకు వెళ్లే అవకాశం లేదు. అవినీతి ఆరోపణలు నిరూపితమై.. దోషిగా తేలిన నేపథ్యంలో అమ్మ సమాధికి ప్రభుత్వ నిధులు వినియోగించటం సాధ్యం కాకపోవచ్చు. ఇలా.. ఎన్నో అంశాల్లో అమ్మకు ఎదురుదెబ్బ తగలనుంది. అదే జరిగితే.. తన తర్వాత కూడా తన గురించి ప్రజలు చెప్పుకోవాలని.. తన కీర్తిని భవిష్యత్ తరాలు ఘనంగా చాటాలన్న అమ్మ అకాంక్ష తీరే అవకాశం లేదు. మొత్తంగా చూస్తే.. ఒక్క తీర్పు అమ్మ ఆత్మకు శాశ్వితంగా అశాంతిని మిగిల్చిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/